మెదక్, జూన్ 12(నమస్తే తెలంగాణ): మనఊరు-మనబడి పథకం మెదక్ జిల్లాలో కార్యరూపం దాల్చడం లేదు. పాఠశాలలను సకలహంగులతో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనఊరు-మనబడి పథకం నీరుగారిపోయింది. బుధవారం నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైనా పాఠశాలల్లో మాత్రం పనులు పూర్తి కాలేదు. సకల హంగులతో పాఠశాలలను తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించినా పనులు ముందుకు సాగడం లేదు. మనఊరు-మనబడి పథకంలో మంజూరైన నిధులతో పనులు పూర్తి చేయాలంటూ ఆదేశించారు. మొదటి విడుతలో ఎంపిక చేసిన పాఠశాలల పనుల్లో కొన్ని చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకొని ఒప్పించి పనులు చేయిస్తున్నారు. పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు.
సగం కూడా పూర్తి కాని పాఠశాలలు
మెదక్ జిల్లాలో 313 పాఠశాలలను మనఊరు-మనబడికి ఎంపిక చేశారు. ఇందులో 142 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. వీటికి రూ.137.81 కోట్లు మంజూరయ్యా యి. రూ.36.98 కోట్ల పనులు పూర్తి కాగా, ఇప్పటివరకు రూ.27.48 కోట్ల బిల్లులు విడుదలయ్యాయి. ఇంకా రూ.9.50 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సకాలంలో బిల్లులు రావడం లేదని మరమ్మతులు, విద్యుత్, గోడలకు రంగులు వేసే పనులను కాంట్రాక్టర్లు ఆలస్యంగా చేస్తున్నారు. అంతేకాదు నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. అంతేకాదు మనఊరు-మనబడి పథకం కింద పాఠశాలలకు భవనాలు పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
చేసిన పనులకు అందని బిల్లులు
ప్రభుత్వ పాఠశాలల రక్షణకు ప్రహరీల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, వంట గదులు, ఫ్లోరింగ్, విద్యుత్ సౌకర్యం, మూత్రశాలలు, ఫర్నిచర్, మధ్యాహ్న భోజనం చేసేందుకు డైనిం గ్ హాల్స్ నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూ రు చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను ఈ పనులకు కేటాయించారు. పనులు చేసినా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులను ఆపేశారు.
రూ.27.48 కోట్ల బిల్లులు విడుదల
మనఊరు-మనబడి పథకం కింద మెదక్ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చేపట్టిన పనులకు రూ. 27.48 కోట్ల నిధులు విడుదలయ్యాయి. జిల్లా వ్యా ప్తంగా 313 పాఠశాలలు ఎంపిక కాగా, అందులో 142 పాఠశాలల్లో మన ఊరు-మన బడి పథకం కింద పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కోసం రూ.137.81 కోట్లు మంజూరయ్యాయి.
– రాధాకిషన్, డీఈవో, మెదక్