రాయపోల్ డిసెంబర్ 12 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో గత ఐదేళ్లుగా మండల కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేసిన పర్వేజ్ అహ్మద్ (Parvez Ahmed ) తన స్వగ్రామమైన మంతూర్ సర్పంచిగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పర్వేజ్ 456 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ.. ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా నిలిచిన పర్వేజ్‌కు ఈసారి గ్రామస్థులు జైకొట్టారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మంతూర్‌లో సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో పర్వేజ్ ఎన్నికల బరిలో నిలిచారు. గులాబీ పార్టీ బలపరచడంతో భారీ తేడాతో సర్పంచ్ సీటు కైవసం చేసుకున్నారు.
తొలి విడత ఎన్నికల్లో సొంతూరికి సర్పంచ్‌గా ఎన్నికైన పర్వేజ్ అహ్మద్ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ‘నాపై నమ్మకం ఉంచి గ్రామ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిపించిన మంతూర్ గ్రామస్థుల రుణం తీర్చుకోవడానికి మంచి అవకాశం కల్పించారు. సర్పంచ్‌గా ఊరి బాగు కోసం నిబద్దత కలిగిన సేవకుడిగా పనిచేస్తాను. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) సహాయ సహకారాలతో, మంతూర్ గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ది చేస్తాను. గ్రామ ప్రజలు నాపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయకుండా అందరి సహకారంతో మండలంలోనే మన ఊరిని ఆదర్శంగా అభివృద్ధి చేస్తాను’ అని పర్వేజ్ హామీ ఇచ్చారు.
గతంలో తనకు మండల కో ఆప్షన్ చేసిన అనుభవం ఉందని. గ్రామాభివృద్ధి కోసం తాను నిర్విరామంగా కృషి చేస్తానని పర్వేజ్ తెలిపారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానని చెప్పారు.