సిద్దిపేట : తెలంగాణ ఉద్యమ రోజుల్లో కేసీఆర్(KCR) కు వచ్చిన జన ప్రభంజనం ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ కనిపించిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు విజయవంతం కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల (BRS candidates) గెలుపు ఖాయమైందని ధీమాను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ సభలకు అంత స్పందన లేదని, అమిత్ షా (Amit Shah) సభకు జనాలు లేక ఏడు నిమిషాల్లో ముగించారని వెల్లడించారు. సరూర్‌నగర్‌లో రాహుల్ సభకు అదే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీ (Congress Guarantees) ల వైఫల్యం పై గరంగరంగా ఉన్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్ కు శిక్ష వేయాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారని తెలిపారు.
తెలంగాణ కు ఏమి ఇవ్వని బీజేపీ కి ఉత్తపుణ్యానికి ఓటేందుకు వేయాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర బంధాన్ని ప్రజలు గుర్తించారని వివరించారు. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు. కాంగ్రెస్ హయాంలో పుట్టెడు కష్టాలు వచ్చాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ బోగస్ సర్వేల పేరుతో బీఆర్ఎస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ రెండు రోజులు బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ గ్యారంటీ యే తెలంగాణకు శ్రీరామ రక్ష
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని హరీష్‌రావు అన్నారు.
కేసీఆర్ ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకుని పఠాన్ చెరుకు సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయం చేశారని ఆరోపించారు. రిజర్వేషన్లపై గొంతు చించుకుంటున్న రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ లో ఎందుకు రిజర్వేషన్ పాటించలేదని ప్రశించారు.
ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి స్థానికతను ప్రశ్నిస్తున్ున రేవంత్ రెడ్డి నిజామాబాద్ లో జీవన్ రెడ్డికి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు.రేవంత్ పుణ్యమా అని తెలంగాణలో భూముల ధరలు పడి పోయాయని ఆరోపించారు. మెదక్ బీజేపీ అభ్యర్థి జిమ్మిక్కుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హరీష్‌రావు కోరారు.