సిద్దిపేట రూరల్, జనవరి 2 : చివరి ఆయకట్టు భూములకు మహర్దశ పట్టనుంది. ఏడాది పొడవునా మల్లన్నసాగర్ నీరు చెరువులకు చేరేందుకు పెండింగ్ కాల్వల నిర్మాణానికి భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. మల్లన్నసాగర్ 1ఆర్ కాల్వ.. ఆయకట్టు సామర్థ్యం సుమారు 21 వేల ఎకరాలుగా లెక్కతేల్చారు. ఈ భూముల్లో పంటలు పండించేందుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కాల్వల నిర్మాణం శరవేగంగా చేపడుతున్నది. ప్రధానంగా సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక సిద్దిపేట రూరల్ మండలం పరిధిలో ఉందనే విషయం తెలిసిందే. రూరల్ మండలంలోని చెరువులు, కుంటలు నింపేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించగా కొన్ని కాల్వల నిర్మాణం పూర్తయింది. అయితే, మల్లన్నసాగర్ 3ఆర్, 4ఆర్ కాల్వల నిర్మాణం చేపట్టి పుల్లూరు, బండచెర్లపల్లి గ్రామాల చెరువులు, కుంటలు నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
పుల్లూరులోని పడమట చెరువు, వెంకటయ్య చెరు వు, నాగులకుంటకు నీళ్లు చేరితే రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. అయితే, సిద్దిపేట రూరల్ మం డల పరిధిలోని గ్రామాల్లో రైతులు ప్రధాన పంటలుగా మి ర్చి, ఇతర కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. వీటిని సిద్దిపేట పట్టణంలోని రైతు మార్కెట్‌కు వివిధ వాహనాల్లో తరలించి నేరుగా విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. దీంతోపాటు మల్లన్నసాగర్ 1ఆర్ పరిధిలోని బండారుపల్లి, తడ్కపల్లి, పొన్నాల, ఎన్సాన్పల్లి, సిద్దిపేట, నాంచారుపల్లి, బక్రిచెప్యాల, వెల్కటూరు, భాషగూడెం, మిల్లపల్లి, దుద్దెడ, అం కిరెడ్డిపల్లి, కొనాయిపల్లి, బండారం, మర్పడక గ్రామాలకు సాగునీరు అందించేందుకు కాల్వల నిర్మాణం జరుగనుంది.
సిద్దిపేట రూరల్ మండలంలో సాగు ఇలా..
సిద్దిపేట రూరల్ మండలంలో 8053 మంది రైతులు 12,989 ఎకరాల్లో వరి పండిస్తుండగా మొక్కజొన్నను 12 13 మంది రైతులు 1377 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 636 మంది రైతులు 715.21 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. మిగతా పంటలు అయిన జొన్నలు, కందులు, పెసర్లను 440 మంది రైతులు 416.31 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులు 644 మంది కాగా, 719 ఎకరాల్లో పంట సాగవుతుంది.
కొనుగోలు కేంద్రాలతో రైతుకు అండగా ప్రభుత్వం..
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉత్పత్తులను ఏటా కొనుగోలు చేస్తున్నది. దొడ్డు రకం వడ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందున మద్దతు ధర దక్కుతున్నది. పత్తిని సీసీఐ కేవలం 10-35 శాతం పంటను కొనుగోలు చేస్తుండగా, మిగతా పత్తిని బహిరంగ మార్కెట్లు, ప్రైవేటు వ్యాపారులకు రైతులు అమ్ముకుంటున్నారు. కందులు, మొక్కజొన్నను ఏటా మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నది. వేరుశనగ, సెనగలు, మినుములు, పెసర్లకు మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండడంతో సిద్దిపేట మార్కెట్లో ఆశించిన మేర మద్దతు ధర లభిస్తున్నది.
ప్రభుత్వం చేయూత..
రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. రైతుబంధు, ఉచిత విద్యుత్, కాళేశ్వరం జలాలు కాల్వల ద్వారా చెరువులు నింపడంతో జలకళ సంతరించుకుంది. ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. తాజాగా సిద్దిపేట రూరల్ మండలంలోని బీడు భూములకు సాగు నీటిని అందించేందుకు కాల్వలు రైతులకు ఉపయోగపడనున్నాయి.
రైతుల తరఫున మంత్రికి కృతజ్ఞతలు..
మండలంలోని చివరి భూములకు కూడా సాగు నీరందించాలనే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు పని చేస్తున్నారు. కాల్వల నిర్మాణం పూర్తయితే ఏడాది పొడవునా రైతులకు సాగు నీరు అందుతుంది. రైతులు ఎన్ని రకాల పంటలైనా సాగు చేసుకోవచ్చు. కాల్వలకు కావాల్సిన భూసేకరణ కోసం మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
– పల్లె నరేశ్‌గౌడ్, సర్పంచ్, పుల్లూరు