సంగారెడ్డి,నవంబర్ 9(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ‘విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం’ అనే అంశంపై రెండురోజుల జరిగే జాతీయస్థాయి సదస్సును శనివారం కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌మూర్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న 100 ఉన్నత, సాంకేతిక విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు విద్యాసంస్థల్లో ప్రత్యేక సెల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ..ఐఐటీ హైదరాబాద్‌లో జాతీయస్థాయి నిర్వహించ డం సంతోషంగా ఉందన్నారు. సీనియర్ సైకాలజిస్టు నాగ్‌పాల్ మాట్లాడుతూ..ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అనంత్ నాగేశ్వర్ ఆన్లైన్లో సదస్సులోని విద్యార్థులు, ప్రొఫెసర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సదస్సులో ఐఐటీలతో పాటు 50 ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌మూర్తి, ఐఐటీ డైరెక్టర్ బీఎస్‌మూర్తి, ప్రొఫెసర్లు, సైకాలజిస్టులు స్టాల్స్‌ను తిలకించారు. ప్రతి విద్యాసంస్థ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లు, విద్యార్థులు స్టాల్స్‌లో పాల్గొని ప్రజంటేషన్ ఇచ్చారు. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన సన్‌షైన్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సన్‌షైన్ టీమ్ విద్యార్థులు వర్షిణి, సాయికుమార్, రిషికుమార్ ఐఐటీ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను సందర్శకులకు వివరించారు. మానసిక వత్తిడికి గుర య్యే విద్యార్థులను గుర్తించేందుకు ఫ్రెండ్స్ బడ్డీలు, మెంటార్స్, కౌన్సిలర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే మానసిక వత్తిడి ఎదురయ్యే విద్యార్థులు సులువుగా కౌన్సిలింగ్ తీసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా యాప్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన విద్యార్థులు అరవింద్, శ్రావ్య తమ సంస్థలో మానసిక ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ సర్వీస్ టీమ్ గురించి సందర్శకులకు తెలియజేశారు. ఐఐటీ భువనేశ్వర్‌లో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు క్రమం తప్పకుండా క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.