సిద్దిపేట, అక్టోబర్ 3 : సిద్దిపేట అంటే సేవకు పెట్టింది పేరని, సిద్దిపేట నుంచి ప్రారంభమైన అన్నదానం ఎల్లలు దాటి అమర్నాథ్ అయోధ్య వరకు సాగుతుందంటే సిద్దిపేట మట్టి మహిమ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కరీంనగర్ రోడ్డు అయ్యప్ప దేవాలయ సమీపంలో నిర్మించ తలపెట్టిన అమర్నాథ్ సేవా సమితి భవనం భూమి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అమర్ నాథ్ సేవా సమితి సర్వజన హితం అని, సిద్దిపేటలో ఆరంభించిన ఈ కార్యక్రమం ఎల్లలు దాటి విశ్వ వ్యాప్తమైందన్నారు. అమర్ నాథ్ సేవా సమితి స్ఫూర్తితో కేదార్ నాథ్, అయోధ్య వరకు సిద్దిపేట అన్నం భక్తులకు అందుతుందడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట అంటే సేవకు సామాజిక, ధార్మిక ఆధ్యాత్మికతకు నిలయంగా మారిందన్నారు. తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.