రాయపోల్ సెప్టెంబర్ 17 : 22ఏ భూముల జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు అనుమాండ్ల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ 22ఏ జాబితాలో భూములు ఉండటంతో రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించాలని ఆయన కోరారు. ఎన్నో సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ, వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు 22ఏ జాబితా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంకు రుణాలు తదితర వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
భూములపై హక్కులు ఉన్నప్పటికీ, 22ఏ జాబితాలో పేర్లు ఉండటంతో తమ ఆస్తులను స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోతున్నామని పలువురు భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, 22ఏ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, భూ యజమానుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.