హుస్నాబాద్ రూరల్: ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని పందిల్లలో మహిళా సమాఖ్య భవనం, పల్లె ప్రకృతి వనం, పందిల్ల స్టేజీ వద్ద మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు, పొట్లపల్లిలో సీసీరోడ్డు పనులు, మహిళా సమాఖ్య భవనం తదితర అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు విరివిగా నిధులను కేటాయిస్తున్నదని తెలిపారు. పట్టణాలకు దీటుగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, నర్సరీ, పల్లెప్రకృతివనం, చెత్త సేకరణకు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఉన్నాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన కొనియాడారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కానుందని దీంతో హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మి, సర్పంచ్ రమేశ్, జడ్పీటీసీ భూక్య మంగ, ఎంపీటీసీ బాణాల జయలక్ష్మి పాల్గొన్నారు.