సిద్దిపేట అర్బన్, నవంబర్ 02 : జిల్లాలో జనవరి 01, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 01వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదు, చిరునామాలో మార్పులు, ఇతర సవరణలు చేసుకోవడానికి భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 6,7,27,28 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.
ఓటర్ల తుది జాబితాను 2022 జనవరి 05న ప్రచురించడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఓటు హక్కు పొందాలన్నారు.
www.voterportal.eci.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం ఓటరు హెల్ప్‌లైన్ నెంబర్ 1950ను, సమీపంలోని బూత్ లెవెల్ అధికారిని సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.