దుబ్బాక, డిసెంబర్ 13 : దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి అధ్యక్షతనలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దుబ్బాక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని మొదట సభ్యులు తీర్మానం చేశారు. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతుబీమా పథకంలో అనర్హులకు లబ్ధి చేకూరుతుందని పద్మనాభంపల్లి సర్పంచ్ కండ్లకోయ పరశురాములు ఆరోపించారు. 60 ఎండ్లు పైబడిన రైతులు రైతుబీమా పథకంలో ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. రైతుబీమా పథకంలో అర్హులైన రైతుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయల వద్ద ఏర్పాటు చేయాలని కోరారు. ‘మనఊరు -మనబడి’ పథకంలో నిధులు మంజూరైన పనులు ప్రారంభించడం లేదని పోతారెడ్డిపేట ఎంపీటీసీ చంద్రసాగర్ మండిపడ్డారు.
చిట్టాపూర్, పోతారెడ్డిపేట, దుబ్బాకలో చెరువు కట్టల నుంచి నీరు లీకేజీతో రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే చెరువు కట్టలకు మరమ్మతులు చేపట్టాలని సభ్యులు కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందే లా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ రవిందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కైలాస్, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, వైస్ ఎంపీపీ రవి, ఎంపీడీవో భాస్కరాశర్మ, తహసీల్దార్ సలీం మియా, కో-ఆప్షన్ మెంబర్ హైమాద్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.