Superstitions | మంత్రాలు.. తంత్రాలు అంటూ మూఢనమ్మకాలు నమ్మవద్దని, మూఢ నమ్మకాలు నమ్మి ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి సూచించారు. మూఢ నమ్మకాలపై ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్కల్ గ్రామంలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రాలు తంత్రాలు అంటూ మూఢనమ్మకాలు నమ్మవద్దని, మూఢ నమ్మకాలు నమ్మి ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు.
మూఢనమ్మకాలతో ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకోవద్దు..
ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలని, ఈ రోజుల్లో ఆసుపత్రులలో ఆధునిక వైద్యం అందుబాటులో ఉందని ఎస్ మహిపాల్ రెడ్డి తెలిపారు. లేనిపోని మూఢనమ్మకాలతో ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకొని కొట్టుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు రావాలని ఇరు వర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. సీసీ కెమెరాలు 24 గంటలపాటు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీని ఇస్తాయని తెలిపారు. ఆశ, భయం, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. బ్యాంకు అధికారులు అని ఫోన్ చేస్తే నమ్మవద్దు. ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలను గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దు, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఆన్లైన్ గేమ్స్ ఆడి మీరు మీ కుటుంబాలను రోడ్డున పడవేయవద్దు. చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఉన్న కుటుంబ సభ్యులను దుఃఖ సాగరంలో ముంచొద్దని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు.
గంజాయి ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి..
ఇంట్లో ఉన్న యువకులు, పిల్లలపై ఒక కన్నేసి ఉంచాలి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు గమనిస్తూ ఉండాలన్నారు. మూఢనమ్మకాలు, చేతబడులు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు, సామాజిక రుక్మతల గురించి సిద్దిపేట పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు శ్యాంసుందర్, కనకయ్య, ప్రసాద్, ప్రకాష్, బిక్షపతి, నాటకం పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.