Thoguta Orphans | తొగుట మార్చి 19 : తల్లి తండ్రుల అకాల మరణంతో అనాధలుగా మారిన తొగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన కెమ్మసారం నాగరాజు, భాగ్యల పిల్లలకు అండగా నిలుస్తామని సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి భరోసా ఇచ్చారు. ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఆదివారం భార్యాభర్తలు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
భార్యాభర్తల అకాల మరణంతో నలుగురు పిల్లలు మీనాక్షి (9), మహేష్ (7), లక్కీ (5), శ్రవణ్ (4)లు ఆనాధలయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వారు ఇవాళ చిన్నారులను పరామర్శించారు. చిన్నారులకు తమవంతుగా కే హరికృష్ణా రెడ్డి రూ.10,000, జీడిపల్లి రాంరెడ్డి రూ. 5,000, మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ లు వేల్పుల స్వామి, పాగాల కొండల్ రెడ్డి రూ.5,000 చొప్పున, సిద్దిపేటకు చెందిన వి ఎల్ ఆర్ కన్ స్ట్రక్షన్ వారు రూ. 3000 అందించారు.
కరువు కాటకాలు ఏర్పడటంతో ప్రజలకు ఉపాధి కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని, తెలంగాణలో మళ్లీ ఆత్మహత్యలు, ఆకలి చావులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సహాయం అందించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలోనే కెమ్మసారం నాగరాజుకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగిందన్నారు.
దంపతుల ఆత్మహత్య, చిన్నారులు ఆగమైన విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారని, వారికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. పరామర్శించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షుడు నందారం వెంకట్ గౌడ్, కుమార్ సేటు, ప్రభాకర్ రెడ్డి, కిషన్, రాకేష్, బండారు స్వామి గౌడ్ తదితరులు ఉన్నారు.