‘ఇది కంటెంట్ ఉన్న సినిమా. ఈ తరహా సినిమాలను ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. రాజమౌళి, తారక్, సుకుమార్, నాని.. ఈ సినిమా విజయాన్ని కాంక్షించారు. దానికి తగ్గట్టే ఈ రోజు ప్రీమియర్లో స్పందన చూశాను. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా ఇది’ అని శ్రీవిష్ణు అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఎమోషనల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’. రెబా మోనికా జాన్ కథానాయిక. హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదలైంది.
ఈ సందర్భంగా గురువారం మీడియా ప్రీమియర్ అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో శ్రీ విష్ణు మాట్లాడారు. అందర్నీ ఆకట్టుకునేలా ఈ సినిమా రావడం కోసం తమ టీమ్ నిద్రలేని రాత్రుళ్లు గడిపిందని సందీప్ గుణ్ణం తెలిపారు. ఇందులో శ్రీవిష్ణు నటన కొత్తగా ఉంటుందని, రెబా మోనికా పోలీస్ ఆఫీసర్గా అద్భుతంగా నటించిందని దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో నటించడం పట్ల కథానాయిక రెబా మోనికా జాన్ ఆనందం వెలిబుచ్చింది. ఇంకా మనీషా ఎ.దత్, రమ్య, సుదర్శన్, అయ్యప్ప పి.శర్మ తదితరులు మాట్లాడారు.