మెదక్ మున్సిపాలిటీ, జూలై 6: దేశవ్యాప్తం గా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్స్పైర్-మానక్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. దీంట్లో భాగంగా ఏటా దేశవ్యాప్తంగా 5 లక్షల పాఠశాలలను ఎంపిక చేసి ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నది. ఇన్స్పైర్ అవార్డు-మానక్ ద్వారా 10లక్షల ఆవిష్కరణలు చేయిస్తారు. వీటిలో లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ప్రతి విద్యార్థికీ రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం చెల్లిస్తారు. 10 నుం చి 15 ఏండ్గలోపు వయస్సు ఉన్న ఆరు నుం చి పదో తరగతి విద్యార్థులు దీనికి అర్హులు. ఒక పాఠశాల నుంచి మూడు వరకు నామినేషన్లు పంపవచ్చు. విద్యార్థుల ఫొటోలు, ప్రాజెక్ట్ వివరాలు వీడియోలు, చిత్రాలు, యూ-డైస్ కోడ్, పాఠశాల ఈ మెయిల్, విద్యార్థి ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా, గైడ్, హెచ్ఎం ఫోన్‌నంబర్లు అవసరం. 2024-25 సంవత్సరానికి ప్రతిపాదనలను సెప్టెంబర్ 15లోగా వెబ్సైట్ పంపించాలి.
నిబంధనలు..
ఇప్పటి వరకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోని పాఠశాలల హెచ్ఎంలు వెంటనే వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓఆర్టీ) పూర్తిచేసి ఆన్లైన్లో జిల్లా అథారిటీకి పార్వర్డ్ చేయాలి. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల అడ్రస్, మెయిల్, ఫోన్ నెంబర్, హెచ్ఎం పేరు, ఇతర వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి. ఓఆర్టీ చేసిన 24 నుం చి 48 గంటల్లో రిజిస్టర్ చేసిన ఈ మెయిల్ ఐడీకి యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తాయి. ఓఆర్టీ పూర్తయిన పాఠశాలకు సంబంధించిన పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్‌వర్డ్‌పై క్లిక్ చేస్తే పాస్వర్డ్ తిరిగి మెయిల్‌కు వస్తుంది. ఈ మెయిల్ అడ్రస్ మర్చిపోతే తిరిగి కొత్తగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్‌టైం రిజిస్ట్రేషన్ విండోలో పాఠశాల పేరు లేకపోతే ఆదర్స్ ఆప్షన్లో పాఠశాల పేరు చేర్చి ఓఆర్టీ పూర్తి చేయాలి. ఓఆర్టీ పొందిన తరువాత యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఆధారంగా వెబ్సైట్ నుంచి విద్యార్థుల నామినేషన్ పూర్తి చేయాలి. నామినేషన్ సమయంలో పీడీఎఫ్ ఫార్మాట్లో విద్యార్థ్థి ఫొటో, ఆధార్ ఐడీ, విద్యార్థి బ్యాంక్ అకౌం ట్ సిద్ధ్దంగా ఉంచుకోవాలి.
ప్రోత్సాహకాలు..
ప్రాజెక్టులను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పరిశీలిస్తారు. ఎంపిక చేసిన విద్యార్థి వ్యక్తిగత ఖాతాకు రూ.10 వేలు జమ చేస్తారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైతే రూ.25 వేలు, జాతీయస్థాయిలో ఎంపికైతే రూ.40 నుంచి 60 వేల నగదు ప్రదా నం చేస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందజేస్తారు. ప్రతిభావంతులకు ఐఐటీ, నీట్ ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు. సెప్టెంబర్ 15 లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.