రాయపోల్, ఏప్రిల్ 14: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి, భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను పలువురు నాయకులు, అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు కొనియాడారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపినిచ్చిన నాయకులు.. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.
అంబేదర్క్ జయంతి వేడుకల్లో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. దేశానికి ఒకే రాజ్యాంగం, సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆయన ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వం, లౌకికత్వం వంటి విలువలను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా యువత చెడు వ్యసనాలు, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమాజంలో ఉన్నతమైన పదవులు సాధిస్తూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై నిర్భయంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమాన సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉండాలని అన్నారు.
మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు, దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం రాయపోల్తో పాటు మండలంలోని బేగంపేటలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్సై మానస, మండల విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి దౌల్తాబాద్ ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అయ్యగల్ల రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుర్ర నర్సింలు, మండల ఉపాధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి మల్లేశం, దళిత సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు.