రాయపోల్, అక్టోబర్ 30: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో మొంథా తుఫాన్ (Cyclone Montha) రైతులను నిండా ముంచింది. రాయపోల్‌లో (Rayapol) వానాకాలం సీజన్లో అధిక శాతం మంది రైతులు మొక్కజొన్న (Corn) పంటను వేశారు. పంట చేతికి వస్తున్న సమయంలో తుఫాన్ రావడంతో రైతులు మార్కెట్లో ఆరబోశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయిపోయింది. మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తుండడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

వర్షం కురవడంతో మొక్కజొన్నలు పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల వద్ద మొక్కజొన్నలు మొలకెత్తడంతో ధర పెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల వ్యాప్తంగా బుధవారం కురిసిన భారీ వర్షాలకు కోతకు వచ్చిన వరి వంగడంతో పంట నష్టం వాటిల్లింది. పత్తి చెల్లలో చేతికి వచ్చిన పత్తి నల్లబరడంతో రైతుల కష్టం కన్నీళ్లను మిగిల్చింది.

వరుసగా కురుస్తున్న వర్షాలకు రైతులు వేసిన పంటలు దెబ్బ తినడంతో ఈ వానకాలం సాగు రైతులను బాధకు గురిచేస్తుంది. మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం నిళ్లలో మునిగిపోవడం. మొక్కజొన్నలు తడిసిపోయి మొలకెత్తడం. పత్తి పంట ఎర్రబారడం తదితర పంటలు వర్షానికి దెబ్బ తినడంతో రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. అధికారులు స్పందించి జరిగిన పంట నష్టానికి వివరాలు సేకరించి జిల్లా అధికారులకు సమర్పించి తమకు న్యాయం చేయాలని మండల రైతులు కోరుతున్నారు.