మిరుదొడ్డి, జూలై 18 : క్యాన్సర్ వ్యాధి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో గుంతల రోడ్లు, గుడ్డి దీపాలు ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎనుకటి రోజులు తీసుకొచ్చేవిధంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. గుంతలమయమైన బీటీ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
బీటీ రోడ్ల మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ అక్బర్పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్ కమాన్ నుంచి మోతె మీదుగా మిరుదొడ్డి మండలం కాసులాబాద్, మిరుదొడ్డి వరకు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పల్లెల్లో ఎంత మద్యం అమ్ముడవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సర్వే చేయించి, ఆ పల్లెల్లో బెల్టుషాపులు పెట్టించాడే గానీ, రైతులకు ఎన్ని విత్తనాలు, ఎంత యూరియా అవసరం అవుతుందని అంచనా వేయకుండానే పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్పై నిత్యం అసత్య ఆరోపణలు చేయడమే తప్ప.. రాష్ట్రంలో పాలన లేదని తోట కమలాకర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు పనులు చేపట్టడానికి వెనుకంజ వేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ సమావేశం జరిగితే అక్కడ ఆ స్టేజి ఎక్కి కూర్చుంటాడే తప్ప.. ఆయనకు రైతుల బాధలు పట్టడం లేదని విమర్శించారు. పల్లెల్లో బీటీ రోడ్లకు మరమ్మతులు చేయకుంటే.. కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.