హుస్నాబాద్, నవంబర్ 9: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నించిన వారందరిపై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతున్నదని, ప్ర జలను మోసం చేసిన కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. శనివారం హుజూరాబాద్‌లో రెండో విడత దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం అమానుషమన్నారు. ధర్నాలో జరిగిన తొక్కిసలాటలో గాయాలపాలై దవాఖానలోచికిత్స పొందుతున్న కౌశిక్‌రెడ్డిని శనివారం సాయంత్రం కరీంనగర్‌లోని అపోలో దవాఖానలో పరామర్శించారు.
ఈ సందర్భంగా మీడియాకు ప్రకటన విడుదల చేశారు. హామీలపై బాండ్లు రాసిచ్చి, ఆలయాల్లో ప్రమాణాలు చేసిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. దళితబంధు గతంలో ఇచ్చినదానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆ విషయాన్ని పక్కనపెట్టారన్నారు. అధికారంలోకి వచ్చివరకు అలవికాని హామీలిచ్చి, ప్రలోభపెట్టి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ నాయకులు, అనంతరం ప్రజలనోట్లో మట్టికొడుతూ సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. కౌశిక్‌రెడ్డితోపాటు దళితులపై చేసిన దాడి అమానుషమన్నారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని, దళితులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.