హైదరాబాద్/సంగారెడ్డి, జూలై 6 (నమస్తే తెలంగాణ): గంజాయి మహమ్మారి గ్రామాలకు విస్తరించింది. పచ్చని పల్లెల్లో యువతను పీల్చి పిప్పిచేస్తున్నది. ప్రతి పల్లెలో కనీసం ఐదారుగులు గంజాయి బాధితులు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అర్బన్ ప్రాంతాల నుంచి సులువుగా గ్రామాల్లోకి గంజాయి సరఫరా అవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఊరి చివర శ్మశానం, చెరువు గట్లు, స్కూళ్లు, రోడ్లు, రైల్వే ట్రాక్‌ల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సాయంత్రం కాగానే బ్యాచ్‌ల వారీగా అక్కడికి చేరుకొని కలిసి గంజాయి తాగుతున్నారు. కొన్నిచోట్ల రోడ్లపైనే గంజాయి పీల్చుతూ హంగామా సృష్టిస్తున్నారు.
అర్బన్ ప్రాంతాల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి బ్యాచ్‌లు రూ.500, రూ.1000కి గ్రాము ల చొప్పుల గంజాయి విక్రయిస్తున్నాయి. కాలేజీల్లో చదువుతున్న గ్రామీణ యువకులకు స్నేహం ముసుగులో సిగరెట్, బ్రీజర్, బీర్ వంటివి అలవాటు చేసి, ఆ తర్వాత గం జాయి వినియోగించేలా ప్రోత్సహిస్తున్నట్టు పలు సంస్థల పరిశోధనలో వెల్లడైంది. గంజాయి సేవిస్తున్న వారిలో టీనేజర్లే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. యవ్వనంలో ఉషారుగా ఉండాల్సిన వారు.. ఎదురురొమ్ము పీక్కపోయి, ముఖమంతా పాలిపోయి, కండ్లు గుంజుకుపోయి, బలం లేక బక్కచిక్కి.. గంజాయి వ్యసనంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
‘స్టఫ్’ కోసం ఎంతదూరమైనా..
‘మాల్’ అనే కోడ్ గంజాయి అని సులువుగా తెలిసిపోతుండడంతో ‘స్టఫ్’ అనే కోడ్‌తో గంజాయి క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైలు మార్గాలు ఉన్న గ్రామాల పరిధిలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తక్కువ మొ త్తంలో రైళ్లలోనే ఎక్కువగా గంజాయి సరఫరా అవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గంజాయికి అలవాటు పడినవారు స్టఫ్ కోసం ఎంతదూరమైనా వెళ్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఎండు గం జాయి కాకుండా గంజాయి చాక్లెట్లు తిం టూ మత్తులో జోగుతున్నారు.
పోలీసులు, నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ సిబ్బంది నిర్వహిస్తున్న దాడుల్లో అధిక మొత్తంలో గంజాయి, గంజాయి ఆయిల్, చాక్లెట్లు పట్టుబడుతుండడం గమనార్హం. ఆరునెల్లలో రాష్ట్రంలో 2682 కేజీల గంజాయి, 91 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 1.25 కేజీల హషీష్ ఆయిల్, 117.2 గ్రాముల చరస్, 6 కేజీల ఓపీఎం, 384.4 గ్రా. ఎండీఎంఏ, 80 గ్రా. హెరాయిన్‌ను ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలోనూ గంజాయి విక్రయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల దాడుల్లో నిత్యం ఎక్కడో ఒకచోట పట్టుబడుతున్నది. ప్రధానంగా సంగారెడ్డి నుంచి గంజాయి స్మగ్లింగ్ జరుగుతుండడంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
గ్రామస్థాయిలో కమిటీలు వేస్తాం
పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సమన్వయంతో అన్ని గ్రా మాల్లో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేస్తాం. కార్యాచరణ మొదలుపెట్టాం. డ్రగ్స్ అనర్థాలపై స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేలా విద్యా శాఖతో ఒప్పందం చేసుకుంటున్నాం. డ్రగ్స్‌కు బానిసైన వారిని దారిలోకి తెచ్చేందుకు రిహాబిలిటేషన్ సెంటర్లను ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్నది. డ్రగ్స్ మహమ్మారిని తరిమేందుకు అందరూ కలిసి రావాలి.
– వీబీ కమలాసన్ రెడ్డి (ఐపీఎస్), రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్