రాయపోల్, మే 29 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో గ్రామదేవత పోచమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అలంకరించిన బోనాలను తలపై ఎత్తుకుని ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు.
ఈ సందర్భంగా శివసత్తులు పూనకంతో భక్తులను ఆకట్టుకోగా, దప్పు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల నృత్యాలు, సంప్రదాయ కళారూపాలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ వీధులన్నీ భక్తి గీతాలతో మార్మోగిపోగా, యువకులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకున్నారు. పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో గ్రామానికి సుఖశాంతులు, పంటలు సమృద్ధిగా కలగాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపుతో వీరారెడ్డిపల్లి గ్రామం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది. కాగా పోచమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా గ్రామ సర్పంచ్ రొయ్యల సుగుణ శ్రీనివాస్ ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు.