సిద్దిపేట, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హవ్వా ఇవేమి కుళ్లు రాజకీయాలు..? నియోజకవర్గానికి మంత్రులు వస్తే సాధారంగా ఆహ్వానించి నాలుగు పనులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసి అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి.. అరువు తెచ్చిన మనుషులతో రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేయించడం ఇదేం పద్ధ్దతి అంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీరుపై ముక్కును వేలేసుకుంటున్నారు. నిన్ను గెలిపించింది ఇందుకేనా అని ప్రశ్నిస్తున్నా రు..? ఇటీవల కాలంలో స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులకు సమాచారం ఇవ్వకుండానే వారి పరిధిలోని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రొ టోకాల్ పాటించడం లేదు. దీనిపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిరసన సైతం తెలుపుతున్నారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో పోతున్నారని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.
తానే చేశానని, తానే తెచ్చానని గొప్పలకు పోయి..
దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల కల అయిన అక్బర్పేట-భూంపల్లి మండల ఏర్పాటును సీఎం కేసీఆర్ ఇటీవల సాకా రం చేశారు. మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తితో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తామే మంజూరు చేయించామని మండల ప్రారంభోత్సవంలో బీజేపీ నాయకులు రభస చేశారు. దుబ్బాక పట్టణంలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవంతో పాటు ఇతర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శుక్రవారం మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వస్తే పోటాపోటీ నినాదాలు చేయడం ఎంత వరకు సమంజసమని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాను విద్యాబుద్ధులు నేర్చిన దుబ్బాక ప్రాంతం అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో మమకారం, ఆ కృతజ్ఞతగా ఈ ప్రాంత అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారు. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో దుబ్బాక బస్టాండ్, పట్టణంలో ఇతర అభివృద్ధి పనులు చేశారు. వాటిని తానే తెచ్చానని ఎమ్మెల్యే రఘునందన్‌రావు నిత్యం సోషల్ మీడియాలో సొల్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఆయన ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని, ఇవన్నీ ఆయన తెచ్చాడంటే తాము పిచ్చోళ్లం కాదని ఎమ్మెల్యే తీరును ప్రజలు విమర్శిస్తున్నారు.
దుబ్బకలో బీజేపీకి బలం రోజురోజుకూ పడిపోతున్నది. ఆ పార్టీ నేతలే ఎమ్మెల్యే తీరును ఎండగడుతున్నారు. స్థానికంగా వ్యతిరేకత పెరిగి పోతుండడంతో ఏదో ఒక అలజడి చేసి హంగామా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్పా, నియోజకవర్గానికి గెలిచి నాటి నుంచి ఒక్కపని చేయలేదని అందరూ చర్చించుకుంటున్నారు. తన సొంత క్యాడర్ కూడా చేజారి పోతుండడంతో ఏం చేయాలో పాలు పోక ఉక్కిరిబిక్కిరి అవుతూ ఇతర ప్రాంతాల నుంచి ఓ వంద మందిని అరువుకు తెచ్చుకొని మంత్రుల కార్యక్రమాలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాడని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడానికే నిన్ను గెలిపించా మా..? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రతిగా బీజేపీ నాయకుల తీరును ఎండగడుతూ పోటాపోటీ నినాదాలు చేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ బ్యాచ్ మహిళా ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా నెట్టి వేశారు. మహిళలపై వారికి ఆ పార్టీకి ఏ మాత్రం గౌరవం ఉందో దీనిని బట్టి అర్థమవుతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు వాహనానికి అటు, ఇటుగా ఓ పది మందిని పెట్టుకొని రాయలసీమ తరహాలో ఫోజులిచ్చాడు.
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురాడు కానీ, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తీసుకువచ్చిన నిధులను తానే తెచ్చానంటూ ముందే అక్కడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడం.. రిబ్బన్ కట్ చేయడమే ఎమ్మెల్యే పనిగా పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. ఉప ఎన్నికలో గెలిచిన నాటి నుంచి నియోజకవర్గానికి రూపాయి తీసుకు రాలేదని విమర్శిస్తున్నారు. దుబ్బాకలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల చొరవతో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధ్దికి పాటుపడుతున్నారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇది చూసి దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే ఓర్వలేక పోతున్నారు. ప్రతీది రాజకీయం చేయాలని చూస్తున్నారు. దీనిని దుబ్బాక ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే సొంత పార్టీ క్యాడర్ దూరం కావడంతో ఎమ్మెల్యే రఘునందన్ ఆత్మరక్షణలో పడ్డారు. దీనిని కప్పి పుచ్చుకోవడానికి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు.