హుస్నాబాద్, జూలై 5: ‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ ఇచ్చుడు ఉత్తమాటేనా…? వీటికోసం దరఖాస్తు చేసుకొని నెలల తరబడి ఎదురుచూసినా కొందరికి మాత్రమే వచ్చి మరికొందరికి రాకపోవడం ఏమిటీ…? అసలు సర్కారోళ్లు ఇస్తరా…ఇ య్యరా…? రోజు మున్సిపాలిటీకి, గ్రామ పం చాయతీకి, కరెంటు ఆఫీసు, గ్యాస్ ఆఫీసుల చుట్టూ తిరిగేటందుకే సరిపోతున్నది… ఇక మాకు వస్తదో లేదో…ఓట్లేసేదాక ఒక మాట, ఓట్లేసినంక మరో మాట అన్నట్టున్నది సర్కా రు తీరు… ఆరు నెలలుగా ఇగ వస్తది…అగ వస్తది అనుకొని ఎదురుచూడటం తప్ప ఏమీ రావడం లేదు…ఇట్లాంటోళ్లు ఎందుకు చెప్పాలె…ఎందుకు మోసం జేయాలే…’ అంటూ మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వచ్చిన జనం చర్చించుకుంటున్నరు. ఉచితాలంటూ ఎన్నికలకు ముందు ఆశపెట్టి అనంతరం మోసం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
6,919 ప్రజా పాలన దరఖాస్తులు…
హుస్నాబాద్ పట్టణంలో ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర సబ్సిడీల కోసం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులు మొత్తం 6,919 ఉన్నాయి. ఇందులో సుమారు 2వేలకు పైగా దరఖాస్తుదారులకు కరెంటు, గ్యాస్ అందడం లేదు. కొన్నింటిని మున్సిపల్ సిబ్బంది, గ్యాస్ సిబ్బంది ఆన్లైన్లో సరిచేయడంతో పరిష్కారం కాగా, మిగతా వాళ్లు నిత్యం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం కనీసం వెయ్యి మందికి ఉచిత కరెంటు రాకపోవడం, గ్యాస్ డబ్బులు పడకపోవడం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొందరికి వచ్చి మిగతా వారికి రాకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆరు నెలలుగా కరెంటు బిల్లులు కడుతూ, గ్యాస్ కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. కొందరు లబ్ధ్దిదారుల వివరాలు ఆన్లైన్లో సరిగ్గానే ఉన్నప్పటికీ కరెంటు, గ్యాస్ డబ్బులు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఎడిట్ ఆప్షన్ ఇవ్వడమే పరిష్కారం…
ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేయడంలో లోపాలను, దరఖాస్తు దారులు తాము ఇచ్చిన దరఖాస్తుల్లో చేసిన తప్పిదాలను సరిచేసి అందరికీ కరెంటు, గ్యాస్ అందేలా చేయాలంటే కేవలం ఎడిట్ ఆప్షన్ ఇవ్వడమే సరైన పరిష్కారమని పలువురు నిపుణులు అంటున్నారు. హడావిడిగా తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఆగమేఘాలమీద ఆన్లైన్ చేయడం, అవగాహన లేని వారికి కూడా ఆన్లైన్ చేసే బాధ్యతలు అప్పగించడంతో అనేక లోటుపాట్లు చోటు చేసుకున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎడిట్ ఆప్షన్ ఇచ్చి ఆరు నెలలుగా నష్టపోయిన లబ్ధిదారులకు న్యా యం చేయాలని కోరుతున్నారు.
ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ వస్తలేదు
ఉచిత కరెంటు, గ్యాస్ డబ్బులు వస్తలేవు. మా కాలనీల కొందరికి వస్తున్నయ్ మరికొందరికి రావడం లే దు. నేను కొన్ని నెలల నుంచి మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. అయినా నాకు రావడం లేదు. నా పక్కోళ్లకు వచ్చి నాకు రాకపోవడమేంటీ. మాది నిరుపేద కుటుంబం. అయినా నాకు సర్కారు నుంచి సాయం అందడం లేదు. ఇంకా ఎన్ని రోజులు తిరగాలె. రేపు ఎల్లుండి అనుకుంట తిప్పుతండ్రు. ఎప్పుటి నుంచి వస్తయో చెప్పుతలేరు. సర్కారోళ్లు మాలాం టి పేదోళ్లకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తరు. చేతకాకుంటె మొత్తానికే బందు పెట్టాలె. కాని కూలీ పనిచేసుకునే మాలాంటోళ్లను ఇట్ల తిప్పుకోవడం మంచిది కాదు.
– మోతె లక్ష్మి, హుస్నాబాద్