మిరుదొడ్డి : మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళపై గుర్తు తెలియని దుండగులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఆమెపై ఉన్న బంగారు అభరణాలను దోచుకెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో భూంపల్లి పోలీస్ స్టేషన్ వెనుక ఈ ఘటన చోటుచేసుకుంది.
బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రంగయ్యగారి అన్నపూర్ణ (52) ప్రతి రోజు మాదిరిగానే శుక్రవారం కూడా వాకింగ్ వెళ్లింది. ఆ సమయంలో గుర్తుతెలియని దుండగులు అమెపై దాడిచేసి బంగారు అభరణాలు ఇవ్వమని బెదిరించారు. అభరణాలు ఇచ్చేందుకు అన్నపూర్ణ నిరాకరించడంతో ఆమె తలపై బలంగా కొట్టి నాలుగు తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు.
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అన్నపూర్ణను వెంటనే సిద్దిపేటలోని తోహిత్ సాయి దవాఖానకు తరలించారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రంగయ్యగారి జెన్నారెడ్డి సతీమణి అన్నపూర్ణను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. శుక్రవారం ఉదయం అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనుక మార్నింగ్ వాక్కు వెళ్లిన ఆమెపై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. సిద్దిపేటలోని తోహిత్ సాయి దవాఖానలో ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఎమ్మెల్యేతోపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఉన్నారు.
ఈ సందర్భంగా వారు బాధితురాలిని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందిచాలని కోరారు. దాడికి పాల్పడిన దుండగులను వీలైనంత త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ అక్బర్పేట-భూంపల్లి మండల సీనియర్ నాయకుడు పజాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.