Magha masam Jathara| తొగుట : ఏటా మాఘ అమావాస్య జాతర సందర్బంగా తొగుట మండలం వెంకట్రావుపేటలోని వాగ్గడ్డ వద్ద జరిగే వెంకటేశ్వర స్వామి జాతరను విజయవంతం చేయాలని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి కోరారు. ఆదివారం నిర్వహించే జాతరకు గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ ఆధ్వర్యంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జాతర సందర్బంగా ఉదయం 11గంటలకు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాన్ని సేవ ద్వారా జాతర వద్దకు తీసుకురావడం జరుగుతుందన్నారు.
ఈ జాతర సందర్బంగా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ప్రదర్శన ఉంటుంది. కావున పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. జాతర సందర్బంగా గుట్ట వద్ద వెలసిన యోగేశ్వరాలయం, ఎల్లమ్మ, చౌడాలమ్మ, దుర్గమ్మ దేవాలయాలను, దర్గాను కూడా దర్శించుకొనే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
యోగేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి గాంచిందని మూడువైపులా పెద్ద బండలు ఉండగా.. ఈశాన్యంలో దారి ఉంటుందని వాస్తురీత్యా ఆలయానికి ఈశాన్యంలో కూడవెల్లి ప్రవహిస్తుండటంతో వాస్తు రీత్యా ఎంతో ప్రశస్తం చెందిందన్నారు.. ఇక్కడ కొలువు తీరిన యోగేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారమై నిలిచాడని పేర్కొన్నారు.
ఈ జాతర కార్యక్రమం సాయంత్రం 4 నుండి రాత్రి 9 వరకు జరుగుతుంది. జాతరకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరు కావడం జరుగుతుందన్నారు. కావున వెంకట్రావుపేట గ్రామ ప్రజలతోపాటు చుట్టు పక్కల గ్రామాల వారు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, తరలివొచ్చి జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు.