MSG | మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌కి నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ఇప్పటివరకు 157కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో పాటు సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వాలనే ఆలోచనతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. పాటలు, ఫైట్లు, కామెడీ ఎంత ఉన్నా… ప్రేక్షకుడిని ఆలోచింపజేసే చిన్న మెసేజ్ అయినా ఉండాలనే అభిప్రాయం చిరంజీవిలో ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఆయన నటించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ అలాంటి ప్రభావాన్నే చూపించిందంటూ చిరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ స్పందన తెచ్చుకుంది. వింటేజ్ మెగాస్టార్ లుక్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ కలగలిసిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
విమర్శలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకుపోతూ రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విజయం ఆనందంలో ఉన్న చిరంజీవి, సినిమా రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. సంక్రాంతి సందర్భంగా వెంకటేష్‌తో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, సినిమా ప్రభావాన్ని వివరించేందుకు ఆయన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. “మూడు నెలలుగా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న ఓ దంపతులు… విడివిడిగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూశారట. సినిమా చూసిన తర్వాత ఇద్దరూ తిరిగి ఫోన్లో మాట్లాడుకుని, విడాకుల నిర్ణయాన్ని విరమించుకుని మళ్లీ కలిసిపోయారట” అని చిరంజీవి చెప్పారు.
ఆ మార్పుకు ప్రధాన కారణం సినిమాలోని మదర్ సెంటిమెంట్ అని చిరు వివరించారు. “భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలి, మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదు” అని తల్లి పాత్ర చెప్పే సన్నివేశం ఆ జంటను బాగా తాకిందని తెలిపారు. అలాంటి సన్నివేశాన్ని రాసినందుకు దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ అన్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది. కొందరు ఇది నిజంగా జరిగితే మంచి విషయమే అని ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. “డివోర్స్ అంచున ఉన్నవాళ్లందరినీ ఈ సినిమాకి తీసుకెళ్లాలా?” అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయినప్పటికీ, ఒక సినిమా వ్యక్తిగత జీవితాలపై ఇంత ప్రభావం చూపిందన్న మాట వినిపించడమే ఆసక్తికరంగా మారింది.