రాయపోల్.ఏప్రిల్ 27 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని చౌదరి పాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి త్రుతీయ వార్షికోత్సవాలు ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం 8 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, మృత్యుంజయ హోమం, నవగ్రహ, క్షేత్రపాలక, సర్వతోభద్ర, వాస్తు హోమాలు, యాగశాల కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
అలాగే అష్టదిక్పాలక పూజలు, వేదపారాయణం, అగ్నిప్రతిష్ట, ప్రత్యేక లక్ష్మీ అభిషేకం, స్వామివారి వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండో రోజు ఏప్రిల్ 28 ఉదయం నుంచి స్వామివారి పంచామృత అభిషేకం, అర్చనలు, అఖండ దీపారాధన, పురుషసూక్త, లక్ష్మీసూక్త, దుర్గాసూక్త పారాయణాలు, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, వాహన సేవలు, తీర్థప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.
మూడో రోజు ఏప్రిల్ 29న అవభృథ స్నానం, ఆంజనేయ స్వామి అభిషేకం, చందనార్చన, బలి ప్రదానం, పూర్ణాహుతి, స్వామివారి కళ్యాణోత్సవం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని ఆలయ కమిటీ కోరింది.
కాగా మూడు రోజుల పాటు జరిగే వెంకటేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవల సందర్భంగా ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో చళ్లువ పందిళ్లు. నీటి సౌకర్యం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయకమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని తెలిపారు.