కొమురవెల్లి, మే 22 : గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికారులు గుర్తించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో బద్దిపడగ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు వేసిన క్రమంలో లక్షకు రూ.10వేలు వసూలు చేసి కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు.
గ్రామసభలు పెట్టి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను కోరారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి 600 ఫీట్లు 300 ఫీట్లు అనే షరతులు విధించకుండా వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాము చెప్పిన వారికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడే ధోరణి మానుకోవాలన్నారు.
అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే అర్హులను సీపీఎం పార్టీ గుర్తించి వారితో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రామలు చేపడుతామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, మండల కార్యదర్శి తాడూరి రవీందర్, జిల్లా కమిటీసభ్యులు అత్తిని శారత, మండల నాయకులు తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం, వుల్లంపల్లి సాయిలు, బాలకిషన్, శ్రీను, చక్రపాణి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.