మెదక్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి పాఠశాలలో తెలుగు పండిట్ ఉపాధ్యాయుడు వెంకటకృష్ణారెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారు. మనోహరాబాద్ మండలం పాలాట యూపీఎస్‌లో తెలుగు పండిట్ వెంకటకృష్ణారెడ్డి ఆగస్టులో డిప్యుటేషన్‌పై చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. ఇదిలాఉండగా పాఠశాలకు డిప్యుటేషన్‌పై వెంకటకృష్ణారెడ్డి వచ్చినట్లు పాఠశాల పరిధిలోని స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం రవీందర్‌రెడ్డికి కూడా సమాచారం లేదు. అయితే గజగట్లపల్లి పాఠశాలకు ఒక్క రోజు కూడా పాఠశాలకు రాలేదు. అంతేకాదు నాలుగు నెలల పాటు పాఠశాలకు వెళ్లకుండా జీతం తీసుకున్నాడు. ఈ విషయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రణీద్‌కుమార్ తెలుగు పండిట్ వెంకటకృష్ణారెడ్డి బడికి రాకున్నా అటెండెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. అసలు తెలుగు పండిట్ ఉపాధ్యాయుడు జడ్పీ పాఠశాలల్లోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ డిప్యుటేషన్‌పై ప్రాథమిక పాఠశాలకు ఎలా వచ్చాడని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గజగట్లపల్లి పాఠశాల తెలుగు పండిట్ వెంకట కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రణీద్కుమార్కు డీఈవో కార్యాలయం నుంచి నోటీసులు అందజేశారు. పది రోజుల్లో వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఈవో రాధాకృష్ణ తెలిపారు.