మెదక్, (నమస్తే తెలంగాణ)/ సిద్దిపేట/ మద్దూరు(ధూళిమిట్ట), డిసెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలకు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొన్నది. రేషన్ కార్డు లేనివారు, ఆధార్‌కార్డు లేని వారు, ఉన్న వాటిలో అప్డేట్ అవసరమైన వారు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. మెదక్ జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో మీ సేవలో ఆధార్ కేంద్రాలు మూతపడడంతో ఆయా మండలాల ప్రజలు సైతం ఆధార్ కేంద్రం ఉన్న మండల కేంద్రానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్లినా వందల మంది దరఖాస్తుదారులు క్యూలో నిల్చోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, చిన్న పిల్లలతో వచ్చిన మహిళలు, వృద్ధులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.
మెదక్ జిల్లాలో 11 కే్ంరద్రాలు మూసివేత..
మెదక్ జిల్లాలో 16 మీ సేవ పరిధిలో ఆధార్ నమోదు కేంద్రాలుండగా, వీటిలో 11 కేంద్రాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. కేవలం 5 ఆధార్ కేంద్రాలు మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో రేగోడ్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలాల్లో మాత్రమే ఆధార్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా మండలాల ప్రజలు ఆధార్ కార్డు నమోదు, కేవైసీ వివరాల అప్డేట్ కోసం ఇతర మండలాలకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలులో భాగంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డుల కోసం ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. దరఖాస్తుదారులు అధిక సంఖ్యలో ఉండడంతో వారిని నిలువరించడం నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది.
సిద్దిపేటలో..
రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆయా సంక్షేమ పథకాల కోసం ఆధార్ కార్డు అనుసంధానం తప్పని సరి చేయడంతో ఆధార్‌కార్డు ఆప్డేట్ చేయడానికి ప్రజలు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. తీనికి తోడు మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ కోసం ప్రతి ఒక్కరూ గ్యాస్ బుక్ ఈకేవైసీ చేయడానికి ఆయా గ్యాస్ ఎజెన్సీ వద్ద లైన్ కడుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని బ్యాంక్ భరోడా, ఆంధ్రా బ్యాంక్, మున్సిపల్ కార్యాలయంల వెనుక ఉన్న మీ సేవా కేంద్రం వద్ద కరీంగర్ రోడ్డులో ఉన్న ఆధార్ ఆప్డేట్ సెంటర్ల వద్ద ప్రజలు బారులు తీరారు. నూతన ఆధార్ కార్డుల కోసం చిన్న పిల్లలతో వచ్చి ఆధార్ సెంటర్ల వద్ద లైన్ల్లో ప్రజలు నిలబడ్డారు.
ఈ-కేవైసీ తిప్పలు..
కాంగ్రెస్ ప్రభుత్వం అందించే రూ.500లకు గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఈ-కేవైసీని చేసుకోవాలని ప్రచారం కావడంతో ఉమ్మడి మద్దూరు మండలానికి చెందిన ప్రజలు పెద్దఎత్తున మద్దూరు మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద మూడు రోజులుగా పెద్దసంఖ్యలో బారులు తీరుతున్నారు. శుక్రవారం ఉదయం 8గంటల వరకే వందల సంఖ్యలో ప్రజలు గ్యాస్ ఏజెన్సీకి చేరుకున్నారు. సాయంత్రం 5గంటల వరకు ఈ-కేవైసీ చేసుకోవడానికి జనం ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై గ్యాస్ ఏజెన్సీ డీలర్‌ను వివరణ కోరగా, ఈ-కేవైసీ కోసం ఎలాంటి గడువు లేదని, జనం పెద్ద సంఖ్యలో రావడం వల్ల గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయ అన్నారు.
గందరగోళంగా ప్రజాపాలన..
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాలకు అర్హుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ప్రతి దరఖాస్తుకు ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. దీంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రజాపాలనలో గృహలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, చేయూత పథకాలకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందుకుగానూ రేషన్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్, గ్యాస్ కనెక్షన్ నంబర్, విద్యుత్ మీటర్ సర్వీస్ నంబర్ తదితర వివరాలు దరఖాస్తు ఫారంతో జత చేయాల్సి ఉంటుంది. కాగా, కొత్త రేషన్ కార్డుల జారీకి ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదు. ఇది తెలియని జనాలు రేషన్ కార్డుల్లో తమ పిల్లల పేర్లు చేర్పించేందుకు కొత్తగా ఆధార్ కార్డు కోసం కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇదిలావుండగా, రూ.500లకే సిలిండర్ కేవైసీ చేయించుకోవాలని పుకార్లు వస్తుండడంతో సైతం జనాలు ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఆధార్ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంటున్నది.
మెదక్ జిల్లాలో 5 కేంద్రాలు నడుస్తున్నాయి..
మెదక్ జిల్లా వ్యాప్తంగా 16 ఆధార్ కేంద్రాలు ఉండగా, ఇందులో 5 మాత్రమే నడుస్తున్నాయి. 11 ఆధార్ కేంద్రాల ఆపరేటర్ల ఐడీలు తాత్కాలికంగా డియాక్టివ్ చేశారు. ఇందులో నాలుగు ఆధార్ కేంద్రాల్లో మరో పది రోజుల్లో తిరిగి ప్రారంభిస్తాం. ఆయా మండలాల్లోని ఆధార్ కేంద్రాల ఆపరేటర్లు ఆధార్ కార్డులకు సంబంధించిన డాక్యుమెంట్లను సరిగా నమోదు చేయలేదని, మరికొన్ని కేంద్రాల్లో రేషన్ కార్డులోఉన్న వ్యక్తులను ఆధార్ కార్డుల్లో తప్పుగా నమోదు చేయడం లాంటి తప్పులు జరిగాయి. దీంతో ఆయా మండల కేంద్రాల్లో ఆధార్ సేవలు అందడం లేదు.
– సందీప్, ఈడీఎం, మెదక్