
సిద్దిపేట, అక్టోబర్ 18 నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసి వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం చేతికందే సమయంలో రైతన్నకు టీఆర్ఎస్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది. ఈ సారి భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు కొండంత ధైర్యానిచ్చింది. వారం రోజుల నుంచి జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రతి రెండు మూడు గ్రామాల్లో ఒకటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాల అధికారులను అదేశించారు. ఉమ్మడి జిల్లాలో 13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకు గాను 875 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధా న్యం కొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, బీగ్రేడ్ ధాన్యానికి రూ. 1940గా ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు తదితర వాటిని సమకూర్చనున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వానకాలం వరి కోతలు ప్రారంభమయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా వరిసాగు విస్తీర్ణం పెరిగింది. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ వానకాలం వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ వానకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9,55,600 మంది రైతులు 15,75,904 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఈ వానకాలం వరి సాగు 3,16,545 ఎకరాల్లో 1,78,812 మంది రైతులు సాగు చేశారు. 6,68,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేశారు. జిల్లాలో 405 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా అంచనా. మహి ళా సంఘాల ద్వారా 224, సొసైటీల ద్వారా 169, ఏఎంసీ ద్వారా 8, మెప్మా ద్వారా 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలో 1,12,138 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఇందుకు గాను 1,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశా రు. జిల్లాలో 143 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. డీసీఎంఎస్ ద్వారా 12, పీఏసీఎస్ ద్వారా 52, మహిళా సంఘాల ద్వారా 79 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. మెదక్ జిల్లాలో 2,56,207 ఎకరాల్లో వరి పంటను వేశారు. 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. 327 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా 102, పీఏసీఎస్ 221, ఏఎంసీ 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
చివరి గింజ వరకు కొంటాం
సీఎం కేసీఆర్ రైతుల సంక్షే మం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధరను కల్పించడంతోపాటు రైతు ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఈ వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్ధేశం చేశాం. ఇప్పటికే జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనందున కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభిస్తాం. కొనుగోలు కేంద్రాల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాలు చర్యలు తీసుకుంటాం.
కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ధ్యానం కొనుగోలు
కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. గత యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చినప్పటికీ ప్రతి గింజను కొనుగోలు చేసింది. వారం రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులను జమ చేసింది. గత యాసంగిలో సిద్దిపేట జిల్లాలో 405 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మహిళా సంఘాలు, సొసైటీల, మా ర్కెట్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1,13,408 మంది రైతుల వద్ద నుంచి 542806.120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, నేరుగా రైతుల ఖాతాల్లో రూ.1024.05 కోట్లు జమ చేసింది. మెదక్ జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 72,106 మంది రైతుల నుంచి 442193. 640 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.834.86 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో మొత్తం 37,265 మంది రైతుల వద్ద నుంచి 182924. 800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతుల ఖాతాలో రూ. 345.36 కోట్లు జమ చేశారు.
బాధ తప్పింది..
ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయడం సంతోషం. రైతులు పండించిన పంటను కొంటామని ప్రభుత్వం చెప్పింది. గతం లో ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో వేసింది. ఈసారి కూడా త్వరగా డబ్బులు రైతులు ఖాతాల్లో వేయాలి. ప్రతి ఊరుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం తో రైతులకు దళారుల చుట్టూ తిరిగే పని తప్పింది.
యాసరేణి బాల్‌రాజు, రైతు, జాలపల్లి
సీఎం కేసీఆర్ సార్ దేవుడు
సీఎం కేసీఆర్ సార్ దేవుడు. యాసంగి మాదిరిగానే దొడ్డు వడ్లను కొంటామనడం సంతృప్తినిచ్చింది. రైతులకు పెద్ద దిక్కు సీఎం కేసీఆర్ సారే. మునుపెన్నడూ లేనివిధంగా రైతులకు ఎంతో మేలు చేస్తున్నడు. వరికి మద్దతు ధర కూడా ఇస్తాననడం మంచి పరిణామం.
-రాజయ్య, నిజాంపేట, రామాయంపేట