సిద్దిపేట, నవంబర్ 1: రాష్ట్రంలో పండించే వరిధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీపీ జోయల్‌డెవిస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. వచ్చే యాసంగి నుంచి దొడ్డు రకం ధాన్యా న్ని కొనుగోలు చేయమని ఎఫ్‌సీఐ తేల్చి చెప్పిందన్నారు. రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ తమ నిర్ణయాన్ని పునఃసమీంచుకోవాలన్నారు. ధా న్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదన్నారు. సకాలంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యానికి సంబంధించిన డబ్బులు జమచేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో రైతులకు ఎరువులు,విత్తనాలు,రైతు బంధుతో వరిసాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందన్నారు.
గతంలో రైతులు సాగునీటి కోసం బోర్లు వేసి అప్పులపాలయ్యేవారని, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటర్లు కాలిపోయేవని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా నేడు భూగర్భజలాలు పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం….పంట దిగుబడి పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో జిల్లాలో 6లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండగా, నేడు 35 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచినట్లు తెలిపారు. యాసంగిలో పారాబాయిల్డ్ రైస్ తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసిందన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విన్నవించారని గుర్తుచేశారు. వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్ష నాయకులు నోరు పారేసుకోవడం కాదని, కేంద్రాన్ని ఒప్పించి పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేలా చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడిప్పుడే తెలంగాణలో సాగు ముఖ చిత్రం మారుతోందన్నారు. అంతకు ముందు మంత్రి నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించారు. సివిల్‌సప్లయ్ డీఎం హరీశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు విజేందర్‌రెడ్డి, చంద్రం పాల్గొన్నారు.
ఆటోడ్రైవర్ కుటుంబానికి చెక్కు అందజేత
సిద్దిపేట పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. సిద్దిపేటలో మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ తరపున సత్త య్య భార్య భారతికి రూ.2 లక్షల బీమా చెక్కును హరీశ్‌రావు అందజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట ఐడీవోసీ మీటింగ్‌హాల్‌లో ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్యాక్స్ చైర్మన్లు, వ్యవసాయాధికారులు, ఏపీఎంలు, రైస్‌మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల బాధ్యులు, రైతు బంధు సమితి సభ్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో 1,22,989 హెక్టార్లలో వరిసాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 7, 62,533 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదన్నారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 396 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ- గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1960, కామన్ రకానికి రూ.1940 మద్దతు ధర ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో పేదలకు రేషన్‌బియ్యం అందజేసేందుకు పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తున్నదన్నారు. రైస్‌మిల్లర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, యాదగిరిరెడ్డి, రఘునందన్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
పది రోజుల్లో పార్టీ కమిటీలు పూర్తి చేయాలి
“టీఆర్ఎస్ ఆవిర్భా వం…స్వరాష్ట్ర సాధన…రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన ఘనత సిద్దిపేటకు ఉంది…సీఎం కేసీఆర్… టీఆర్ఎస్ పురిటి గడ్డ 14 ఏండ్ల పోరాటానికి స్ఫూర్తి నిచ్చిననాటి ఉద్యమానికి…నేటి అభివృద్ధికి దిక్సూచి సిద్దిపేట” అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 20 ఏండ్లు అయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కమిటీల నియామకం పది రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఐదు మండలాలకు పరిశీలకులను నియమించినుట్లు తెలిపా రు. సిద్దిపేట మండలానికి సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, సిద్దిపేట రూరల్‌కు రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, చిన్నకోడూర్‌కు మండలానికి పాల సాయిరాం, నంగునూర్కు మూర్తి భాల్రెడ్డి, నారాయణరావుపేటకు మాణిక్యరెడ్డి, మండలాల వారీగా సమన్వయకర్తలుగా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు10మంది చొప్పున నియ మించిన ట్లు తెలిపారు. పట్టణ కమిటీ, వార్డు కమిటీల నియామకంపై ఐదుగురు సమన్వయ కర్తలు ఉంటారని చెప్పారు. వెంకటేశ్వర్రావు, వేణుగోపాల్‌రెడ్డి, లోకలక్ష్మీరాజం, మోహన్‌లాల్, గుండు భూపేష్‌ను నియమించినట్లు తెలిపారు.