Actor Arjun | సినీ నటులకు ఉండే అభిమానుల ప్రేమ, అభిమానంతో చేసే పనులు ఎంత ప్రత్యేకమో తెలిసిందే. కొందరు తమ అభిమాన హీరోల కోసం గుడులు కడితే, మరికొందరు అన్నదానాలు, రక్తదానాలు చేస్తూ తమ అభిమానం చాటుకుంటుంటారు. అయితే అదే అభిమానం కొన్ని సందర్భాల్లో మితిమీరితే సెలబ్రిటీలకు ఇబ్బందులు కూడా కలుగుతాయని యాక్షన్ కింగ్ అర్జున్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.తనకు ఎదురైన ఓ సంఘటనను గుర్తుచేసుకుంటూ అర్జున్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో నెల్లూరులో ఒకసారి హోటల్ నుంచి కారులోకి వెళ్లే సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడారని తెలిపారు. తనతో సెక్యూరిటీ ఉన్నప్పటికీ, అభిమానులు ఉత్సాహంలో వారిని పక్కకు తోసేసి తన దగ్గరకు వచ్చారని చెప్పారు.
ఆ తొందరలో తాను చాలా కష్టపడి కారులోకి ఎక్కి వెళ్లిపోయానని, తాను వెళ్లిన తర్వాతే సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారని వివరించారు. అభిమానులు ప్రేమతోనే వస్తారని తెలుసు కానీ, ఆ ప్రేమ కొన్ని సార్లు ఇబ్బంది కలిగిస్తుందని అర్జున్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సీతా పయనం” సినిమా ప్రమోషన్స్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా పలు వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటున్నారు. అదే ఇంటర్వ్యూలో తనకు ఆంజనేయ స్వామిపై ఎంతో భక్తి ఉందని, అందుకే ఒక భారీ ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్టించానని తెలిపారు. ఆ విగ్రహం 32 అడుగుల ఎత్తుతో, సుమారు 180 టన్నుల బరువుతో కూర్చున్న భంగిమలో ఉంటుందని చెప్పారు.
ఈ ఆలయ నిర్మాణం 2006–2007 ప్రాంతంలో ప్రారంభమై పూర్తి కావడానికి దాదాపు 17 సంవత్సరాలు పట్టిందని అర్జున్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహాల్లో ఒకటిగా ఈ విగ్రహాన్ని పేర్కొంటారని కూడా చెప్పారు. సినీ జీవితంతో పాటు భక్తి, ఆధ్యాత్మికతకు కూడా ప్రాధాన్యం ఇస్తూ అర్జున్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు.