
సిద్దిపేట, అక్టోబర్ 1: బతుకమ్మ, దసరా పండుగలకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరెలను అందించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. పండుగ ఏర్పాట్లు, బతుకమ్మ చీరెల పంపిణీపై ప్రజాప్రతినిధులు, అధికారులతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లా స్టాక్ పాయింట్ నుంచి మండల స్టాక్ పాయింట్, అక్కడి నుంచి గ్రామ పంపిణీ పాయింట్‌కు చీరెలు చేర్చినట్లు తెలిపారు. రెండు రోజుల్లో మిగతా చీరెలు జిల్లాకు వస్తాయన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామాలు, గ్రామాల్లో నిబంధనల ప్రకారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేయాలని, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరారు. బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు పండుగ ముగిసే వరకు చేపట్టాలన్నారు. విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, చెరువుల అలుగుల వద్ద పేరుకుపోయిన పాకురు, నాచు తొలిగించే పనులు అధికారులు చేపట్టాలని ఆదేశించారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ఘనంగా జరిగేలా చూడాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు, గ్రామాల్లో ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు వేడుకల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక వర్షాలతో జలాశయాలు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయని, ఆ ప్రాంతాల్లో భారీకేడ్లను ఏర్పాటు చేసి జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ మోడ్‌తో అన్ని గ్రామాలు, పట్టణాల్లో కరోనా వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేయాలని, వందశాతం పూర్తయిన గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి సందర్శించి పెండింగ్ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ను సందర్శించి పెండింగ్ పనుల పూర్తిపై ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించాలని కలెక్టర్, ఎమ్మెల్యేకు మంత్రి సూచించారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్లు, బతుకమ్మ చీరెల పంపిణీ ఏర్పాట్లను వివరించారు.
సిద్దిపేటలో ప్రారంభించనున్నమంత్రి హరీశ్‌రావు…
సిద్దిపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మండల కేంద్రాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మూడు రోజుల్లో పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.