తూప్రాన్, ఫిబ్రవరి 7 : బీఆర్ఎస్ హయాంలోనే తూప్రాన్ అభివృద్ధి జరిగిందని, తూప్రాన్ అభివృద్ధి తాను తీసుకుంటానని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని అల్లాపూర్ నుంచి తూప్రాన్ బస్టాండ్ వరకు శనివారం నిర్వహించిన రోడ్‌షో, బైక్ ర్యాలీ, కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తూప్రాన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూముల ధరలు పాతాళానికి పడిపోయాయని, బంగారం ధరలు ఆకాశానికి అంటాయన్నారు.
మూడురోజులకు ఒకసారి నీళ్లొచ్చేవి…
ఒకప్పుడు తూప్రాన్‌కు మూడు రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవని, గీతారెడ్డి గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తూప్రాన్ వచ్చినప్పుడల్లా అడ్డుపడి నీళ్ల బిందెలతో నిరసన తెలిపేవారని, కానీ.. కేసీఆర్ వచ్చాక ఇంటింటికీ ప్రతిరోజు రెండోఫ్లోర్కు తాగునీళ్లు వస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తూప్రాన్ అభివృద్ధి జరిగిందన్నారు. కానీ, నేడు డివైడర్ మధ్యలో ఎండిపోయిన చెట్లను పట్టించుకునే వారు కరువయ్యారని అన్నారు. తాను పోతరాజ్‌పల్లి నుంచి తూప్రాన్‌కు బైక్‌పై కూర్చుని వస్తుంటే ఎక్కడ పడిపోతానో అనే భయం కలిగిందని, సుమారు రోడ్డుపై 40-50 గుంతలు దాటుకుంటూ వచ్చానని, కనీసం గుంతలకు డాంబర్ కూడా పూసే దమ్ము కాంగ్రెస్‌కు లేదన్నారు.
తూప్రాన్‌కు 50 పడకల దవాఖానా మంజూరు చేస్తే ,గతంలో మెరుగైన వైద్య సేవలు అందించేవారని, కానీ.. నేడు డాక్టర్లు లేరు గజ్వేల్‌కు పో, హైదరాబాద్‌కు పో అంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. తూప్రాన్‌కు ఆర్డీవో ఆఫీస్ తెచ్చింది, ఫోర్ వే లైన్ రోడ్డుగా మార్చింది, ప్రతీ గల్లీని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వ కాదా అని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో సీసీరోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు రూ.20 కోట్లు మంజూరు చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులు నిలిపివేసిందన్నారు.
ఎన్నికలు రావడంతో కొన్ని వార్డుల్లో శంకుస్థాపనలతో కాంగ్రెస్ నేతలు హడావిడి చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి మచ్చ వేణుగోపాల్ రెడ్డి, తూప్రాన్ పట్టణ అధ్యక్షుడు సతీష్ చారి, మాజీ జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, మాజీ మున్సిపల్ ఛైర్మెన్ బొంది రాఘవేందర్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇద్దరు లీడర్ల ఆధిపత్య పోరుతో తూప్రాన్‌కు అన్యాయం
నర్సారెడ్డి, మైనంపల్లి మధ్య ఆధిపత్య పోరుతో తూప్రాన్ అభివృద్ధి నిలిచిపోయిందని హరీశ్‌రావు అన్నారు. మైనంపల్లి, నర్సారెడ్డి మధ్య ఆధిపత్య పోరుతో ప్రజలను బలి చేస్తున్నారని మండిపడ్డారు. తూప్రాన్ అభివృద్ధి కావాలా ? ఆధిపత్య పోరు కావాలో తేల్చుకోవాలన్నారు. సద్దితిన్న రేవును మరవకూడదని, కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ పది కిలోల బియ్యం చొప్పున ఇచ్చారని, త్వరలో రంజాన్ పండుగ రానుందని, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ముస్లిం అక్కాచెల్లెల్లకు, అన్నాదమ్ముళ్లకు రంజాన్ తోపా వచ్చి ఉండేదన్నారు.
రేవంత్ రెడ్డికి నోరు తెరిస్తే బూతులేనని, అందుకే కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతుపిత అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క పెద్ద ప్రాజెక్టు ఇవ్వలేదని, బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్టేనని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15లక్షలు వేస్తామని చెప్పి, 12 ఏండ్లుగా ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. మహిళలకు రూ. 2500 ఇస్తానని, ఒక్కో అక్కాచెల్లెలికి రేవంత్‌రెడ్డి రూ. 65 వేలు బాకీ పడ్డాడని, ఓట్లకు వచ్చినప్పుడు ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. కేసీఆర్ రాగానే రూ. 2 వేల ఫించన్, రైతుబంధు, కళ్యాణలక్ష్మి తదితర పథకాలు అమలు చేశారని, రేవంత్‌రెడ్డి రూ. 4 వేల పింఛన్ ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.