సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర వాహన ఆధారిత సేవలందించే డ్రైవర్లు శనివారం ఆలిండియా బ్రేక్‌డౌన్‌లో భాగంగా నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస చార్జీలను రూపొందించాలని అగ్రిగేటర్ కంపెనీలను డిమాండ్ చేశారు. యాప్ ఆధారిత సేవలు నిలిపివేసినట్టు చెప్పారు. అయితే యాప్ సేవలు బంద్ కావడంతో నేరుగా క్యాబ్, ఆటోలను ప్రయాణికులు ఆశ్రయించారు. దీంతో చార్జీల పెంపుతో గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు.
ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరుకోవడానికి నేరుగా క్యాబ్, ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో వాళ్లు రెట్టింపు ధరలు చేశారని, ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్‌కు చేరుకోవడానికి క్యాబ్ రూ.3 వేల వరకు వసూలు చేశారని ఓ ప్రయాణికుడు వివరించాడు. అప్పటికే ఎయిర్‌పోర్టు యాజమాన్యం యాప్ సర్వీసులు బంద్ అయినట్టు బోర్డులు పెట్టడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోల్లో వాళ్లు అడిగినంత చెల్లించి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా తెలంగాణకు చెందిన గిగ్ వర్కర్స్ ఆలిండియా బ్రేక్ డౌన్ ప్రొటెస్ట్‌లో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సలావుద్దీన్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.