– ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఐటీసీలో కార్మికుల నిరసన
బూర్గంపహాడ్, మార్చి 31 : కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలు ఎన్నో పోరాటాలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం పట్టించుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 13వ వేతన ఒప్పంద కాలం ముగిసినా ఆ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ఐటీసీ కర్మాగారంలో అడ్మిన్ బ్లాక్ వద్ద కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ.. 13వ వేతన ఒప్పందంలో రాసుకున్న పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించడంతో పాటు 14వ వేతన ఒప్పందంలో రూ.22 వేలు వేతన ప్యాకేజీతో పాటు 100 శాతం మెడికల్, రూ.12 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ సాధించాలని, 12వ వేతన ఒప్పందంలో రాసిన విధంగా బదిలీ కార్మికులకు సీనియారిటీ ప్రకారం పర్మినెంట్ విధానం చేపట్టాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
13వ వేతన ఒప్పందాన్ని ఇన్స్టెంట్ అగ్రిమెంట్ అని చెప్పి ప్రస్తుత గుర్తింపు సంఘం ఆ వేతన ఒప్పందంలో రాసుకున్న సమస్యలను నేటికీ పరిష్కరించలేదని ఇది ఆ సంఘం బాధ్యతా రాహిత్యమేనన్నారు. మెడికల్ విషయంలో ఏ మాత్రం తేడాలు వచ్చినా కార్మికులు తీసుకునే నిర్ణయాలకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సిందేనని హెచ్చరించారు. త్వరితగతిన పెండింగ్ సమస్యలను పూర్తిచేసి కార్మికులకు అవసరమైన నూతన క్వార్టర్లు తదితర బెనిఫిట్స్ కల్పించాలని, 30 అంశాలపై నిరసన చేపట్టడం జరిగిందని, ఈ అంశాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.