గుమ్మడిదల, జూలై 29: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలోని సర్వే నంబర్ 261 మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వే నంబర్లోని భూముల వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మార గా తాజా పరిణామాలు ఉత్కంఠతకు దారితీశాయి. తమ భూములపై హక్కులు కల్పించాలని ఓ వైపు రైతులు పోరాడుతుంటే.. మరో వైపు పరిశ్రమ విస్తరణ పేరిట ప్రభుత్వ భూమి ని కేటాయించాలని ఓ ఫార్మా కంపెనీ కోరుతున్నది. ఈ రెండు వాదనల్లో ఏది సరైంది అనే కంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఏ ప్రాతిపదికన తీసుకుంటుంది? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. కొద్దిరోజులు గా ఇదే సర్వే నంబర్ భూములపై రైతుల అ భ్యంతరాలు, భూసేకరణ వివాదాలు చర్చనీయాంశంగా మారగా ఇప్పుడు అదే ప్రాంతం లో తమ పరిశ్రమ విస్తరణ కోసం 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కలెక్టర్‌కు జూన్ 16న ఫార్మా కంపెనీ దరఖాస్తు చేసుకున్నది.
261 సర్వే నంబర్లోని 117 ఎకరాల్లో 66 ఎకరాలు టీజీఐఐసీకి కేటాయింపులపై ప్రాథమిక సమాచారం రావడంతో తమ భూములను కోల్పోతామని 92 మంది రైతు లు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలను టీజీఐఐసీకి ఇచ్చే ప్రసక్తే లేదని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ భూములను టీజీఐఐసీకి బదిలీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మూడు దశాబ్దాలుగా అన్నారంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థగా పేర్కొన్న ఆ ఫార్మా కంపెనీ.. తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది. పరిశ్రమకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయిస్తే కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని సదరు సంస్థ కలెక్టర్‌ను కోరింది. ఇదే 261 సర్వే నంబర్లో అసైన్డ్ భూములు, భూసేకరణ అంశాలపై ఇప్పటికే గ్రామస్తులు, రైతులు తమ అభ్యంతరాలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పరిశ్రమ విస్తరణకు సంబంధించిన తాజా ప్రతిపాదనకు అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.