భద్రాచలం/ చర్ల/ పినపాక/ బూర్గంపహాడ్/ మణుగూరు టౌన్/ కూసుమంచి, జూలై 29: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముసురుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ సన్నటి జల్లులు కురిశాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షం పంటలకు ప్రాణం పోయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో చింతా కొండయ్యకు చెందిన ఇంటిగోడ కూలిపోయింది. సింగరేణి మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు.
భద్రాచలం వద్ద గోదావరి బుధవారం రాత్రి 7 గంటలకు 16.30 అడుగులకు చేరుకుంది. ఎగువన ఉన్న తుపాకులగూడెం, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి 2.50 లక్షల క్యూసెక్కుల నీటి వరద వస్తుండడంతో గోదావరి క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పరీవాహక జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడంతో గురువారం సాయంత్రం 4 గంటల వరకు 25 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉంది. దీంతో నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తాలిపేరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రాజెక్టు అధికారులు 13 గేట్లను రెండు అడుగుల మేర, 11 గేట్లు పూర్తిగా ఎత్తి 84,376 క్యూసెకుల నీటిని దిగున గోదావరి నదిలోకి వదిలారు. ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 29 (నమస్తే తెలంగాణ): రానున్న 36 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు.