మేడ్చల్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు పథకం ప్రకారం దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి కాంగ్రెస్ నాయకులు అభద్రత ఏర్పడి బీఆర్ఎస్ నాయకులపై ఇష్టనుసారంగా దాడి చేసినట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో అభ్యర్థి వనజ శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో గెలుపు ఓటములపై ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో కావాలనే అభ్యర్థి వనజ శ్రీనివాస్ ఇంటి ఎదుట డీజే సౌండ్ సిస్టం పెట్టి..ఘర్షణ పడి..బీఆర్ఎస్ నేతలపై దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి తట్టుకోలేక దాడులకు చేసి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేలా ప్రయత్నం చేసినా.. ప్రజల నుంచి తమకు మరింత మద్దతు పెరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి.
కాంగ్రెస్‌కు ప్రజల్లోకి వెళ్లే ముఖం లేదు..ఎమ్మెల్యే మల్లారెడ్డి
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లోకి కాంగ్రెస్ నాయకులు వెళ్లలేక బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే మాల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారం చేసిన చోట ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్నందున ప్రజల్లోకి వెళ్లే ముఖం లేదన్నారు. మూడు మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేకపోతున్నట్లు మల్లారెడ్డి చెప్పారు. దౌర్జన్యం చేసి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నదన్నారు. దళిత నేత అని చూడకుండా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పరమేశ్‌పై దాడి చేయడంతో తలకు గాయమైందన్నారు. అయినా కాంగ్రెస్ నాయకులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
చర్యలు తీసుకోండి..
బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిణి, సీపీ రమేశ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డిలకు ఫిర్యాదులు చేశారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు.