గ్రేటర్లోని అపార్ట్మెంట్లలో నివసించే వారికి మంచి నీటి బిల్లులు చెల్లించేందుకు జలమండలి ఆటోమేటిక్ మీటర్ రీడర్స్ను ప్రవేశపెట్టింది. ఆ మీటర్లను సరఫరా చేసేందుకు నాలుగు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించింది. నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు సదరు ఏజెన్సీలు మీటర్లను తీసుకెళ్లి బిగించాల్సి ఉంటుంది. మరమ్మతులకు గురైనా వారే రిపేర్లు చేయాల్సి ఉంటుంది. ఏజెన్సీలు సకాలంలో స్పందించకున్నా, వినియోగదారులకు అందించే సేవల్లో ఇబ్బందులకు గురిచేసినా జలమండలి చర్యలు తీసుకుంటుంది. కానీ మీటర్ రీడర్లను సరఫరా చేసే ఏజెన్సీలు సరిగ్గా పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీల నిర్వాహకుల తీరుపై జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
– సిటీబ్యూరో
ఆటోమేటిక్ మీటర్ రీడర్స్ ఏజెన్సీల నిర్లక్ష్యం జలమండలి వినియోగదారుల పట్ల శాపంగా మారుతున్నది. గ్రేటర్ ప్రజలపై నీటి బిల్లుల మోత మోగిపోతున్నది. వేలాది రూపాయల బిల్లులు చెల్లించలేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మీటర్లు మరమ్మతులకు గురైనా.. చెడిపోయినా సరఫరా చేసే ఏజెన్సీల వాళ్లు పట్టించుకోకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కొత్త మీటర్లు బిగించేందుకు రావాలంటూ ఫోన్ చేసినా, స్వయంగా వెళ్లి అడిగినా నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారని వాపోతున్నారు. అటు మీటర్ పనిచేయకపోవడంతో యావరేజీ పేరిట జలమండలి అధికారులు రూ.వేలల్లో బిల్లుల మోత మోగిస్తున్నారు. ప్రశ్నిస్తే మీటర్లు సరఫరా చేసే ఏజెన్సీలతో మాట్లాడుకుని కొత్త మీటర్లు బిగించుకోవాలని సమాధానమిస్తున్నారని వినియోదారులు చెబుతున్నారు. రోజుల తరబడి తిరుగుతున్నా ఏజెన్సీల ప్రతినిధులు స్పందించడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మీటర్ పనిచేయడం లేదని రూ.15 వేలు బిల్లు
నా ఫ్లాట్లో ఆటోమేటిక్ మీటర్ రీడర్ పాడైపోయి నెల దాటింది. జలమండలి అధికారులకు ఫిర్యాదు చేస్తే ఏజెన్సీల ఫోన్ నంబర్లు ఇచ్చారు. వారిని సంప్రదించి నెల రోజులుగా కొత్త మీటర్ బిగించాలని కోరుతున్నాం. ఫోన్ చేస్తే స్పందించడం లేదు. ఒక్కోసారి స్పందించినా రేపు, ఎల్లుండి వస్తామని చెబుతున్నారు. మీటర్ చెడిపోయి నెల దాటడంతో జలమండలి అధికారులు నాకు నోటీసులు పంపించారు. యావరేజీ పేరిట రూ.15 వేల బిల్లు వేశారు. నా సమస్యను జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఏజెన్సీలు, జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో సామాన్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
-ఓ వినియోగదారుడు, నిజాంపేట