
గజ్వేల్ రూరల్, నవంబర్ 1: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నది. అభివృద్ధిలో దూసుకుపోతున్న గజ్వేల్..హరితహారం అమలులోనూ ముందున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అటవీ సిబ్బంది చేసిన కృషితో గజ్వేల్ అటవీ రేంజ్ పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారింది. అధికారులతో కృషితో నేడు వందల ఎకరాల విస్తీర్ణంలో అటవీప్రాంతం పచ్చదనంతో కనిపిస్తున్నది. పచ్చని చెట్ల మధ్య ప్రకృతిలో సేదతీరితే అందులోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ వారి బాధలు మరిచిపోతారు. రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల బాధలను దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో పచ్చనిచెట్ల పెంపకంపై దృష్టి సారించింది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా చేపట్టిన బృహత్తర కార్యక్రమంతో నేడు గజ్వేల్ ప్రాంతంలో అడవుల పునరుద్ధరణతో అటవీ విస్తీర్ణం పెరిగింది.
వందల హెక్టార్లలో మొక్కల పెంపకం..
గజ్వేల్ రేంజ్ పరిధిలోని గజ్వేల్, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, మర్కుక్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఆరేండ్ల క్రితం నాటిన మొక్కలతో అటవీ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ అడవుల సంరక్షణపై దృష్టి సారించడంతో నేడు వందలాది ఎకరాల విస్తీర్ణంలో పచ్చని చెట్లు పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేడు అడవుల్లోకి వెళ్లి కలప కొట్టేందుకు ప్రజలు ధైర్యం చేయడం లేదు. కలప నరికివేతపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. దీంతో అటవీ సంపద వృద్ధి చెందుతున్నది.గజ్వేల్ అటవీ రేంజ్ పరిధిలో 2015-16 సంవత్సరంలో బంగ్లావెంకటాపూర్ అటవీ ప్రాంతంలో 52 హెక్టార్లు, ధర్మారెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో 25 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల మొక్కలు నాటారు. 2016-17లో నర్సంపల్లిలో 50 హెక్టార్లు, మినాజీపేటలో 110 హెక్టార్లు, కోమటిబండలో 160 హెక్టార్లు, మిషన్ భగీరథ ట్యాంకుల ప్రాంతంలో మరో 55 హెక్టార్లు, బంగ్లావెంకటపూర్ అటవీలో 21 హెక్టార్లు, గజ్వేల్ అర్బన్ పార్కు కల్పకవనంలో 105 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక్క ఏడాదే 501 హెక్టార్లలో మొక్కలు నాటారు. 2017-18 ములుగు, నర్సంపల్లిలో 200 హెక్టార్లు, గజ్వేల్ షరీఫ్(కోమటిబండ)లో 200 హెక్టార్లలో భారీగా మొక్కలు నాటించారు.
2018-19లో శివారువెంకటాపూర్లో 40 హెక్టార్లలో మొక్కలు నాటారు. నర్సంపల్లి బ్లాక్ అటవీ మసీద్ శివారులో 40 హెక్టార్లు, జప్తిసింగాయిపల్లిలో 20హెక్టార్లు, రాజీవ్ రహదారి మార్స్ కంపెనీ పక్కన 42 హెక్టార్లు, గజ్వేల్ షరీఫ్ కోమటిబండలో 110 హెక్టార్లు, అర్బన్ పార్కులో 85 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటి సంరక్షించడంతో ఈ ప్రాంతం పచ్చదనాన్ని సింగారించుకున్నది. 2019-20లో మర్కూక్ మండలం కర్కపట్లలో 80 హెక్టార్లలో మొక్కలు నాటా రు. అడవుల సంరక్షణలో భాగంగా ప్రభుత్వ సూ చనలతో అధికారులు రేంజ్ పరిధిలో అడవుల పెంపకంపై ప్రధానంగా దృష్టిసారించారు. 2020-21 నర్సంపల్లి అటవీ ప్రాంతంలో 22 హెక్టార్ల విస్తీర్ణంలో 25 వేల మొక్కలు నాటారు.
గజ్వేల్ రేంజ్ పరిధిలో 1417 హెక్టార్లలో మొక్కల పెంపకం
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1417 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ అధికారులు మొక్కలు నాటారు. వీటిలో నెమలినార, బట్టఘనం, రావి, మర్రి, జువ్వి, మేడి, వేప, నీరుదా, అల్లనేరడి, ఇరికి, పసరగాని, అడవిమామిడి, చింత, ఏగిసా, మారెడు, మద్ది, వాగునుతి, ఉసిరి, తాని, కరకతో పాటు వివిధ రకాల మొక్కలు నాటారు. పండ్ల మొక్కలు పక్షులు, జంతువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సింగాయిపల్లి అటవీ ప్రాంతంలో 5హెక్టార్ల విస్తీర్ణంలో 50 వేల మొక్కలను ఏఎన్ఆర్ ప్లాంటేషన్‌లో పెట్టారు. గజ్వేల్ పట్టణంలోని అర్బన్ పార్కులో మియావాకీ విధానంలో 10 వేల మొక్కలను హెక్టారు విస్తీర్ణంలో నాటారు. పక్కనే పద్మవ్యూహంలో కోనోకార్ఫస్కు చెందిన 5వేల మొక్కలు నాటారు. ఇందులో ప్రవేశ మార్గంతో పాటు బయటకు వచ్చేందుకు వీలుగా దారులను ఏర్పాటు చేశారు. అందులోకి ప్రవేశ మార్గం గుండా వెళ్లిన వారు గజిబిజిగా ఉండే పద్మవ్యూహంలో బయటకు రావడం కష్టతరంగా ఉంటుంది. అధికారుల ఎంతో శ్రమించి ఈ పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేయించారు.
సీఎం కేసీఆర్ కృషి ఫలితమే..
సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఆరేండ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 8.2శాతం అడవుల విస్తీర్ణం పెరిగింది. మొక్కల పెం పకంతో ఆహ్లాదకర వాతావర ణం నెలకొంది. అడవులు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. గజ్వేల్ ప్రాంతంలోని అడవులు పచ్చదనంతో కనిపిస్తున్నాయి.
-వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్
ప్రభుత్వ కృషితోనే పచ్చదనం..
ప్రభుత్వ కృషి ఫలితంగా అడవుల సంరక్షణకు అధికారులందరం ఎంతో కష్టపడి పని చేశాం. ఉన్నతాధికారుల సూచనలతో రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాలను పచ్చదనంగా మా ర్చాం. ఇందులో బీట్, సెక్షన్ అధికారుల కృషి ఎంతో ఉంది. ఆరేండ్ల పాటు కష్టపడడంతో నేడు అటవీ ప్రాంతాలు పచ్చని చెట్లతో కనిపిస్తున్నాయి. త్వరలోనే పండ్ల మొక్కల ఫలాలను అందరూ అందుకుంటారు.
-కె.కిరణ్‌కుమార్, ఎఫ్ఆర్వో, గజ్వేల్