మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 5: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తుషాలపురం మంగవ్వ-మహదేవ్‌లకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సాయి రోహిత్(23) హైదరాబాద్‌లోని సీవీఆర్ కాలేజీలో 2022 బీటెక్ పూర్తి చేశాడు. గతేడాది డిసెంబర్ 20న ఎమ్మెస్సీ చదివేందుకు సాయిరోహిత్ అమెరికాకు వెళ్లాడు.
వాషింగ్టన్ సియెటెల్లోని యూనివర్సిటీ ఆఫ్ మి స్సోరి కాలేజీలో యూనియన్ బ్రాంచ్‌లో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. సాయిరోహిత్ నలుగురు స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటూ చదువుకుంటున్నా డు. జూలై 22న సాయంత్రం 5గంటలకు బయటకు వెళ్లి తిరిగి క్యాబ్‌లో రూమ్‌కు వస్తూ కొంతదూరం రాగానే మరో క్యాబ్లోకి మారాడు. అప్పటి నుంచి రూమ్‌కు రాకపోవడంతో సాయిరోహిత్ స్నేహితుడు అవినాశ్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశా రు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) వారి సాయంతో సాయిరోహిత్ అచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతికారు.
జూలై 24న సమానుష్ సరస్సులో సాయిరోహిత్ మృతదేహం లభ్యమైంది. జూలై 25న సాయిరోహిత్ మృతి చెందిన విషయాన్ని స్నేహితులు కూటిగల్లోని కుటుంబసభ్యులకు తెలిపారు. బయటకు వెళ్లిన సాయిరోహిత్ మృతదేహంగా మారి సరస్సు వద్ద లభ్యమవ్వడంతో అతడి స్నేహితులు, కుటుంబసభ్యులు మృతిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయిరోహిత్ మృతదేహా న్ని కుటుంబసభ్యులు గ్రామానికి తీసుకువస్తున్నట్లు సమాచారం.