సిద్దిపేట, సెప్టెంబర్ 1: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలోని అధికారులు అలర్ట్‌గా ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. ఆదివారం సిద్దిపేట నియోజకవర్గ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి వనరుల పరిస్థితులపై ఆరాతీశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు.
విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ప్రజలు నివసించకుండా చర్యలు తీసుకోవాలని, కూలిన ఇండ్లకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాగులు, చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సిద్దిపేట పట్టణంలో పిచ్చి మొక్కలు తొలిగించాలన్నారు. శివాజీ నగర్, కోమటి చెరువురోడ్డు, కొత్త బస్టాండ్ రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు.