సిద్దిపేట, ఏప్రిల్ 19: ‘కాంగ్రెస్ అంటేనే మోసం… కష్టాలు అనే మాటకు నిదర్శనం.. మన కళ్ల ముందే ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయి’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఆటో కార్మికులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేట ఆటో కార్మికుల కోసం ప్రతి పండుగకు కొత్త బట్టలు ఇస్తున్నాని చెప్పారు. ఆటోలక్ష్మి కింద రూ. 5వేలు, కార్మికులు చనిపోతే రూ.2లక్షలు, పిల్లల చదువు కోసం ఇలా ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల జీవితాలను ఆగం చేసిందన్నారు. సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని మాట తప్పింది, నెలకు రూ.10 వేల జీవన భృతి ఇవ్వాలని అసెంబ్లీలో కొట్లాడితే నోరు మెదపని ఈ ప్రభుత్వానికి వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేసిందన్నారు. రైతు బంధు రూ. 15వేలు, వరి ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు రూ.2,500, కల్యాణ లక్ష్మి కింద రూ.లక్ష రూపాయతోపాటు తులం బంగారం ఇస్తానని మోసం చేసిందన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి , పింఛన్ రూ.4 వేలు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానని మోసం చేసి గద్దెనెకిందన్నారు. రాష్ట్రంలో 40 మంది ఆటో కార్మికులు చనిపోతే ప్రభుత్వం ఆదుకోలేదని, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కూడా పరామర్శించకుండా పట్టించుకోలేదని విమర్శించారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్‌రావు ఒక అబద్ధాల పుట్ట అని.. సిద్దిపేట అభివృద్ధిని చూసి ఓర్వలేని వాడన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.60 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను రూ.100 చేసిందన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోసం చేసిందన్నారు. మెదక్ గడ్డ..గులాబీ అడ్డా… మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.