రాయపోల్, డిసెంబర్ 31: దౌల్తాబాద్ మండలం హైమదర్నగర్ వద్ద ఉన్న తిరుమల ట్రేడింగ్ జిన్నింగ్ మిల్లులో తూకంలో మోసం చేస్తున్నారంటూ రైతులు పత్తి మిల్లు వద్ద శనివారం ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న లీగల్ మెట్రాలజీ సిద్దిపేట జిల్లాఅధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం పత్తిమిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంటాను లారీతో, బాట్లతో తనిఖీ చేయగా తూకంలో ఇరవై కిలోల వరకు తేడా వచ్చింది.
దీంతో కాంటాను సీజ్ చేశారు. తూనికలు కొలతల్లో మోసాలకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తి మిల్లుల్లో తూకంలో మోసాలకు పాల్పడుతూ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. తూకంవేసే ముందు బాట్లు, కాంటాను గమనించుకోవాలని ఆయన సూచించారు.