సిద్దిపేట, డిసెంబర్ 20: బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని, సీఎం రేవంత్ కుట్ర రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిద్దిపేట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాల సాయిరామ్ అన్నా రు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు రాగుల సారయ్య, గుండు భూపేశ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేటీఆర్ అవినీతి చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తున్నదని, ఫార్ము లా ఈ-కార్ రేసులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీకార పాలనకు, పాపిష్టి పాలనకు ఇది ఉదాహరణ అని పేర్కొన్నారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను తిట్టని రోజు లేదన్నారు. తమ కు న్యాయస్థానాల మీద అపార గౌరవం ఉందని, ఉద్యమకాలంలో కూడా ఇలాంటి కేసులను ఎన్నో ఎదురొన్నామని తెలిపారు.
రేవంత్ ఉన్మాది లాగా వ్యవహరిస్తూ కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయాలని దుర్బుద్ధితో కేసులను పెట్టిస్తున్నాడని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన ఫార్ములా ఈ-కార్ రేస్ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించడంతో తెలంగాణ ప్రతిష్ట పెరిగిందన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే దీనిపై అసెంబ్లీలో చర్చించాలని డిమాం డ్ చేశారు.
వ్యక్తిగత కక్షతోనే కేటీఆర్‌పై రేవంత్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే, రేవంత్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కేసులు పెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో నాగుల ప్రశాంత్ గౌడ్, గుజ్జు రాజు, శ్రీకాంత్, రాజశేఖర్, నాగరాజు, పరశురాములు పాల్గొన్నారు.