సిద్దిపేట, నవంబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట ఏసీపీ మధు తన విద్యుక్త ధర్మాన్ని విస్మరిస్తున్నారు. తను ఒక పోలీస్ అధికారిని అనే విషయాన్ని మరిచి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీఎం బర్త్‌డే వేడుకల్లో ఆయన పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో సీఎం రేవంత్ బర్త్ డే వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నాయకులు పూజల హరికృష్ణ తదితరులు కలిసి కేక్ కటింగ్ చేయగా, సిద్దిపేట ఏసీపీ మధు పాల్గొన్నారు.
ఈయన పోలీస్ అధికారా..? లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా అని విమర్శలు వ్యక్తమయ్యాయి. సిద్దిపేట ఏసీపీగా మధు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది. ఇటీవల నంగునూరు మండలంలో నర్మెటలో జరిగిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గొడవకు దారితీసింది. ఎలాంటి పదవులు లేకున్నా కాంగ్రెస్ నాయకులకు ఆయన ఎస్కార్ట్‌ను కల్పిస్తూ అధికార పార్టీపై తన అభిమానాన్ని ఏసీపీ చాటుకుంటున్నారు. ప్రైవేట్ సంభాషణల్లో సైతం బీఆర్ఎస్పై ఆయన తన అక్కసును, నోటి దూలను వెల్లగక్కుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.