సిద్దిపేట, జూలై 1 : (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులకు అందాల్సిన యూరియా పక్కదారి పడుతోంది. డీలర్లు, వ్యవసాయశాఖ అధికారులు కలిసి కాసుల కక్కుర్తితో పక్కదారి పట్టిస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా చేర్యాలలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం నుంచి ఏకంగా దాదాపు 6 వేలకు పైగా యూరియా బస్తాలు పక్కదారి పట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలా ఒక్క చేర్యాలలోనే జరిగిందా..? ఇతర ప్రాంతాల్లో కూడా యూరియా పక్కదారి పట్టిందా…? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు అందినకాడికి దోచుకుంటున్నారు. వీరికి వ్యవసాయశాఖ అధికారులు వంతపాడుతున్నారు. వారు ఇచ్చే కాసులు తీసుకొని రైతులకు శఠగోపం పెడుతున్నారు. పారదర్శకంగా రైతులకు యూరియా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అమలు చేస్తున్నప్పటికీ సిద్దిపేట జిల్లాలో అక్రమ విక్రయాలు మాత్రం ఆగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. యాప్‌లో స్టాక్ లేదని చెబుతుండగా, అదే యూరియా కొందరు మధ్యవర్తులు, బయటి వ్యాపారులకు అధిక ధరలకు చేరుతోందని పలువురు రైతులు వాపోతున్నారు.గతంలో కూడా జిల్లా లో రైతులు బ్లాక్ మారెటింగ్ ఆరోపణలపై నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యాప్‌లో నమోదు చేసుకున్నప్పటికీ అవసరమైన సమయంలో యూరియా అందడం లేదు. జిల్లాలోని కొంత మంది వ్యాపారుల వద్ద మాత్రం అధిక ధరలకు యూరియా లభిస్తోంది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు.
వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని యూరియా కోసం యాప్‌లు, ఎరువుల దుకాణాల చుట్టూ తిరిగినా దొరకని పరిస్థితి. కానీ సిద్దిపేటలోని ఆంజనేయ ఫర్టిలైజర్స్, గణేశ్ ట్రేడర్స్ నుంచి చేర్యాలలోని శ్రీసాయి శివ ఫర్టిలైజర్స్‌కు సబ్బిడీ యూరియా బస్తాలు బదిలీ అయ్యాయి. ఇక్కడ వ్యవసాయశాఖ యాప్ ప్రకారం శ్రీసాయి శివ ఫర్టిలైజర్స్ వద్ద 6,420 యూరియా బస్తాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంత రైతులు యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకున్నారు. కానీ యూరియా బస్తాలు రైతులకు అందలేదు.
బుక్ అయ్యాక అందాల్సిన యూరియా బస్తాలు అందడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అప్రమత్తమైన వ్యవసాయశాఖ జిల్లా అధికారులు ఆరా తీశారు. అసలేం జరిగింది…? ఎందుకు బస్తాలు రైతులకు అందడం లేదు..? అనే కోణంలో ఆరా తీయగా స్థానికంగా ఉన్న ఓ వ్యవసాయశాఖ అధికారి, అక్కడి ఫర్టిలైజర్ డీలర్, సిద్దిపేటకు చెందిన డీలర్లు కాసులకు కక్కుర్తి పడి యూరియా పక్కదారి పట్టించారు.
ఈవిషయంలో జిల్లా స్థాయి అధికారులు చేర్యాల పట్టణలోని దుకాణానికి వెళ్లి యూరియా స్టాక్‌ను పరిశీలించగా 6,249 బస్తాలకు ఒకటి రెండు బస్తాలు మాత్రమే ఉన్న విషయం బయట పడింది. దీంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బస్తాలు రైతులకు అమ్మినట్లు కూడా ఎలాంటి ఆధారాలు దుకాణ యజమాని వద్ద లేవు. రైతులకు రూ.266 చొప్పున విక్రయించాల్సిన బస్తాను ఫర్టిలైజర్ దుకాణాల వాళ్లు ఒక్కో బస్తాను రూ. వెయ్యికి పైగా విక్రయించి డబ్బులు సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. ఈ బస్తాలు బయట అమ్మారని తేటతెల్లం కావడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత ఫర్టిలైజర్స్ దుకాణాలపై కేసులు నమోదు చేశారు.
సిద్దిపేట జిల్లాలోని వ్యవసాయశాఖలో రోజురోజుకూ అవినీతి పెరిగిపోతోంది. పర్సంటేజీలు ఇస్తేనే బిల్లులపై సంతకాలు చేస్తున్నారు.సబ్సిడీ యంత్రాలపై ఇచ్చే బిల్లులకు చేతిలో డబ్బులు పెడితేనే సంతకాలు చేస్తున్నారు. ఫోన్ పే అసలే వద్దు… క్యాష్ మాత్రమే ఇవ్వాలి..అంటూ వాట్సాప్ కాల్ చేసి మరీచెబుతున్నారు. దీంతో డీలర్లు క్యాష్ తీసుకువెళ్లి మరీ సంతకాలు పెట్టించుకున్నారు.
మండల,డివిజన్, జిల్లా స్థాయి వరకు ఎవరి స్థాయిలో వారికి డబ్బులు ముట్టజెప్పుతున్నారు.అలా చేతిలో డబ్బులు పెడితేనే సంతకాలు పెట్టినట్లు డీలర్లు వాపోతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) సీమ్ కింద చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు అందించింది.
ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు 40శాతం సబ్సిడీ, 5 ఎకరాల కంటే ఎకువ ఉన్న ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళా రైతులకు 50 శాతం రాయితీ కింద వ్యవసాయ యంత్రాలు అందించారు. జిల్లా స్థాయి నుంచి ఎవరి స్థాయిలో వారు కమీషన్లు దండుకుంటున్నారు. ఈ సీమ్ కింద రైతులకు ప్రభుత్వం రాయితీతో యంత్రాలు ఇస్తుండగా బిల్లుల కోసం వ్యవసాయశాఖ ఆఫీసర్లు పర్సంటేజ్ డిమాండ్ చేసి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకో అధికారి స్థాయి, పరికరాన్ని బట్టి రూ. 5వేల మంచి రూ.30వేల వరకు కమీషన్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చేర్యాల, జూలై 1 : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో వ్యవసాయశాఖ నిబంధనలు ఉల్లంఘించిన శ్రీబాలాజీ ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, జ్యోతి ఫర్టిలైజర్ షాపులపై శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి ఆఫ్రోజ్ తెలిపారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించినందున శ్రీబాలాజీ షాపులో వారం రోజులు పత్తి, మొక్కజొన్న విత్తనాలు అమ్మరాదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జ్యోతి ఫర్టిలైజర్షాపులో వారం రోజులు పత్తి విత్తనాల అమ్మకాలు నిలిపివేసినట్లు తెలిపారు. షాపుల నిర్వాహకులు వ్యవసాయశాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.