SI Ranjithkumar | నర్సాపూర్, అక్టోబర్ 20 : టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్త వహించాలని ఎస్సై రంజిత్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చాలని వెల్లడించారు. నీటి బకెట్ లేదా ఇసుక దగ్గర ఉంచుకోవాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిని ఆర్పడానికి ఉపయోగపడుతుందనీ అన్నారు.
పటాకులు మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. ఇళ్ల దగ్గర, వాహనాల దగ్గర, విద్యుత్ వైర్ల దగ్గర పటాకులు కాల్చవద్దని వెల్లడించారు. అలాగే పండగ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాహనాలు నెమ్మదిగా నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడప రాదని హెచ్చరించారు.
హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. పండగ కోసం బయటకు వెళ్లే ముందు ఇంటి తలుపులు, కిటికీలు బిగించి లాక్ చేసుకోవాలని, బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, Dial 100 లేదా 112ను సంప్రదించాలన్నారూ. పెద్ద శబ్ద పటాకులు, కాలుష్యం పెంచే పటాకులు వాడవద్దని, పర్యావరణానికి హాని కలగకుండా పండగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. వృద్ధులు, జంతువులు, చిన్నపిల్లలకు ఇబ్బంది కలిగించకుండా పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.