సిద్దిపేట, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితుల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలితాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందించడం ద్వారా జీవనోపాధిని స్థిరపర్చుకోవచ్చని వెనుకబడిన దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తిపంజేశారు.
ఈ పథకంతో ఎంతో మంది దళిత కుటుంబాలు లాభపడ్డాయి. దళిత కుటుంబాలు ప్రభుత్వంపై ఆధార పడకుండా స్వతంత్రంగా జీవించేలా ఈ పథకం దోహదం చేస్తున్నది. దళితబంధు పథకంతో ఎన్నో దళిత కుటుంబాలు నిలదొక్కుకోవడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేట మండలం బంజేరుపల్లికి చెందిన శ్యాగ శ్రీకాంత్ దళితబంధు పథకం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొంది, తనతో పాటు మరో పది మందికి ఉపాధినిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సహాయ సహకారాలతో శ్యాగ శ్రీకాంత్ దళితబంధు పథకం పొంది, దాని ద్వారా ఉపాధి పొందుతున్నాడు. శ్యాగ శ్రీకాంత్ బతుకుదెరువు కోసం పట్నం పోయి, సౌండ్ సిస్టమ్, డెకరేషన్ పనుల్లో కూలి చేసుకుంటూ జీవించేవాడు. 2022లో దళితబంధు పథకం కింద ఆయన ఎంపికయ్యాడు.
ఈ పథకాన్ని పొందిన శ్రీకాంత్ సొంతగా సౌండ్ సిస్టమ్, డెకరేషన్ పరికరాలు కొని, సొంతగా పనులు చేసుకుంటున్నాడు. కొంపల్లి వద్ద ప్రధానంగా ఎస్వీఆర్, నిమ్మల రెండు కన్వెన్షన్లలో సౌండ్ సిస్టమ్, విద్యుత్ దీపాల అలంకరణ చేస్తున్నాడు. ఇతర చోట్లకు ఆర్డర్‌పై వెళ్తున్నాడు. ఈ వృత్తిలో పట్టు లభించడంతో 10 మంది వర్కర్లను పెట్టుకుని ఆర్డర్లు తీసుకుని పనులు చేయిస్తున్నాడు. మెటీరియల్‌ను చేరవేయడానికి చిన్న టాటాఏస్ ఆటో తీసుకున్నాడు. ఎక్కడ ఆర్డర్ ఉంటే అక్కడికి ఆటోలో వెళ్లి పనిచేస్తున్నాడు. తన వద్ద పని చేస్తున్న వర్కర్లకు భోజనం పెడుతూ, నెలకు రూ.12 వేల జీతం ఇస్తున్నాడు.
ఇవన్నీ ఖర్చులు పోను తనకు మంచిగానే గిట్టుబాటు అవతున్నదని శ్యాగ శ్రీకాంత్ తెలిపాడు. కేసీఆర్ ఇచ్చిన దళితబంధుతో మరో రూ.50 లక్షల వరకు ఆస్తిని సంపాదించి సంతోషంగా ఉంటున్నాడు. కేసీఆర్, హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఇటీవల మెదక్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో సౌండ్ సిస్టమ్, విద్యుత్ అలంకరణ చేశాడు. అక్కడ ఫంక్షన్‌కు వెళ్లిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అక్కడ ఏర్పాటు చేసిన పనులు చూసి ఆయనను మెచ్చుకున్నారు. చాలా బాగా ఏర్పాట్లు చేశావు తమ్మీ అంటూ శ్రీకాంత్‌ను హరీశ్‌రావు అభినందించారు.